NTV Telugu Site icon

కోవాగ్జిన్‌కు అమెరికా కితాబు.. ఆ వేరియింట్లపై కూడా సమర్థవంతంగా..!

Covaxin

Covaxin

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్‌కు కితాబు ఇచ్చింది అమెరికా… కరోనాతో పాటు తాజాగా.. భారత్‌లో వెలుగుచూసిన ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కూడా కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. కోవాగ్జిన్‌పై టీకాలపై అధ్యయనం నిర్వహించిన అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌… ఎస్‌ఏఆర్‌ఎస్‌-సీవోవీ-2 ఆల్ఫా, డెల్టా వేరియంట్లను కోవాగ్జిన్ చాలా ప్రభావవంతంగా ఎదుర్కొంటుందని తేల్చింది.. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న కొందరి నమూనాలను సేకరించి అధ్యయనం చేసిన ఎన్‌ఐహెచ్.. ఆల్ఫా లేదా బీ.1.1.7, డెల్టా లేదా బీ.1.617 వేరియంట్లపై మెరుగ్గా పనిచేస్తూ.. ఫలితాలను ఇచ్చినట్టు గుర్తించారు. కోవాగ్జిన్‌ కరోనా వేరియంట్లను నిర్వీర్యం చేయడంతో పాటు యాంటీబాడీలు ఉత్పత్తి చేసినట్లు గుర్తించింది ఎన్‌ఐహెచ్‌.

కరోనా లక్షణాలున్న వారిపై కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ 78 శాతం ప్రభావం చూపినట్లు మూడో దశ ఫలితాల్లో తేలిసన విషయం తెలిసిందే కాగా.. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఏ ప్రమాదం లేదని అగ్రరాజ్యం అమెరికాకు చెందిన సంస్థ తెలిపింది. కాగా, ఆల్ఫా వేరియంట్‌ను తొలిసారి బ్రిటన్‌లో గుర్తించగా, డెల్టా వేరియంట్‌ తొలిసారి భారత్‌లో వెలుగుచూసిన విషయం విదితమే. మరోవైపు.. గతంలో, కోవిషీల్డ్ మరియు కోవాగ్జిన్‌ SARS-CoV-2 వేరియంట్ల ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టాకు వ్యతిరేకంగా పనిచేస్తాయని కేంద్రం పేర్కొంది.. డెల్టా ప్లస్ వేరియంట్‌పై దాని ప్రభావాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. కరోనావైరస్ వ్యాధికి సంబంధించిన నాలుగు రకాలు, ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టా ఉన్నాయి. ఇక, కోవాగ్జిన్‌పై ఎన్‌ఐహెచ్‌ అధ్యయన ఫలితాలతో.. ఆ వ్యాక్సిన్‌కు అమెరికాలోనూ గ్రీన్‌ సిగ్నల్ లభించే అవకాశం ఉంది.