CIA Cyber Attack: CIAపై భారీ సైబర్ దాడి.. అమెరికా నిఘా వ్యవస్థలో కలకలం!

Cia Cyber Attack

Cia Cyber Attack

CIA Cyber Attack: అమెరికా అత్యంత కీలకమైన నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA)పై భారీ సైబర్ దాడి జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. గుర్తుతెలియని హ్యాకర్లు CIAకు చెందిన కీలకమైన ఇంటెలిజెన్స్ డేటాబేస్‌లోకి చొరబడినట్లు సమాచారం. ఈ ఘటన అమెరికా భద్రతా వ్యవస్థలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. హ్యాకర్లు చొరబడిన వ్యవస్థలో సోషల్ మీడియా, శాటిలైట్ చిత్రాలు, ఇతర బహిరంగంగా అందుబాటులో ఉన్న వనరుల నుంచి సేకరించిన సమాచారాన్ని భద్రపరిచి విశ్లేషించేవారు.

ఈ వ్యవస్థను CIAతో పాటు అమెరికా నిఘా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సంభవించే పొటెన్షియల్ ముప్పులను గుర్తించడానికి, కీలక సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగించేవి. ఈ సైబర్ దాడి ప్రభావం ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (ODNI)పైనా పడినట్లు సమాచారం. ఈ దాడికి పాల్పడింది ఎవరు? ఏ దేశానికి చెందిన హ్యాకర్లు ఈ పని చేశారు? అనే విషయాలు ఇప్పటివరకు వెల్లడికాలేదు. హ్యాకర్లు అసలు వ్యవస్థలోకి ఎలా ప్రవేశించారనే వివరాలు కూడా తెలియరాలేదు.

ఇటీవలి కాలంలో అమెరికాలోని కీలక ప్రభుత్వ సంస్థలు వరుసగా సైబర్ దాడులకు గురవుతున్నాయి. అమెరికా వ్యవసాయ శాఖలోనూ సైబర్ చొరబాటు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా FBIలో రెండు వేర్వేరు సైబర్ చొరబాటు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పెంటగాన్, అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాలు కూడా ఇటీవల సైబర్ సంబంధిత ఘటనలతో ప్రభావితమైనట్లు సమాచారం.

కొద్ది రోజుల క్రితం హ్యాకర్లు FBIకి చెందిన నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (NCIC) డేటాబేస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికాలోని ఫెడరల్, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయి చట్ట అమలు సంస్థల మధ్య నేరాలకు సంబంధించిన సమాచారాన్ని బదిలీ చేయడానికి ఈ డేటాబేస్ ఉపయోగపడుతుంది. NCICపై ఇది రెండో సైబర్ దాడిగా పేర్కొంటున్నారు. కొన్ని నెలల క్రితం కూడా FBI వ్యవస్థపై హ్యాకర్లు దాడి చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ఇటీవల మైక్రోసాఫ్ట్ భారీ సాంకేతిక అంతరాయాన్ని ఎదుర్కొంది. ఈ కారణంగా దాదాపు 36 గంటల పాటు పలు సేవలు నిలిచిపోయినట్లు సమాచారం. Outlook, Teams సహా అనేక Office యాప్‌లను వినియోగదారులు ఉపయోగించలేకపోయారు. అమెరికాలోని CIA, FBI వంటి అత్యంత కీలకమైన భద్రతా సంస్థలతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు కూడా సైబర్ ముప్పులను ఎదుర్కొంటుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని రక్షించుకోవడం అమెరికా నిఘా వ్యవస్థకు ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.