Chinese Sailors Attack: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా ఆర్మీ రెచ్చిపోతోంది. చిన్న దేశాలైన ఫిలిప్పీన్స్, బ్రూనై, వియత్నాం వంటి దేశాలను భయపెడుతోంది. తమది కాకున్నా, తమదిగా చెప్పుకుంటూ దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. ముఖ్యంగా ఇటీవల పలు సందర్భాల్లో ఫిలిప్పీన్స్ కోస్టుగార్డు నౌకలపై దాడులకు తెగబడింది. ఈ దేశాలను కవ్విస్తూ దాడులకు ప్రేరేపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా చైనా కోస్టుగార్డు దళాలు దారుణానికి ఒడిగట్టాయి.
దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక రీఫ్‌కు సమీపంలో ఉన్న నౌకాదళ నౌకపై చైనా కోస్ట్‌గార్డ్ నావికులు కత్తులు మరియు గొడ్డలితో నిరాయుధ ఫిలిప్పీన్స్ సైనికులపై దాడి చేశారు. 2020లో భారత, చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో భారత సైనికులపై చేసిన దాడి తరహాలోనే ఫిలిప్పీ్న్స్ దళాలపై చైనా కోస్టుగార్డు సిబ్బంది గొడళ్లు, కత్తులతో దాడికి తెగబడ్డారు. దీనికి సంబంధించిన వివరాలను ఫిలిప్పీన్స్ విడుదల చేసింది. సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సియెర్రా మాడ్రే అనే శిథిలావస్థలో ఉన్న యుద్ధనౌకలో ఉన్న మెరైన్‌లను తరలించే సమయంలో ఫిలిప్పీన్స్ దళాలను చైనా కోస్టుగార్డు అడ్డుకుంది.
Read Also: Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. రీల్స్ కోసం భారీగా జనాలు
ఫిలిప్పీన్స్ మిలిటరీ బుధవారం విడుదల చేసిన ఫుటేజీలో చైనా సైనికులు అరవడం, కత్తులతో దాడులకు పాల్పడవం వంటికి కనిపించాయి. గొడ్డలి పట్టుకున్న చైనా సైనికుడు ఫిలిప్పీన్స్ సైనికుడిపై దాడి చేస్తానని బెదిరించడం వంటి ఈ వీడియోల చూడొచ్చు. ఓ సైనికుడు తన బొటనవేలిని కోల్పోయినట్లు ఫిలిప్పీన్స్ మిలిటరీ తెలిపింది. అయితే, చైనా మిలిటరీ మాత్రం తమవాళ్లు ఎలాంటి దాడులకు పాల్పడలేదని చెబుతూ ఓ ఫోటోను విడుదల చేసింది. ఇందులో చైనా దళాలు ఆయుధాలను కలిగి ఉన్నట్లు చూపలేదు. తన కోస్ట్‌గార్డు సంయమనం పాటించినట్లు, ఫిలిప్పీన్స్ సిబ్బందిపై ఎలాంటి దాడి చేయలేదని బుకాయించింది. చైనా కోస్టుగార్డు సముద్రపు దొంగల్లా దాడికి తెగబడ్డారని ఫిలిప్పీన్స్ ఆర్మీ ఆరోపించింది.
దక్షిణ చైనా సముద్రం తమదిగా చెప్పుకుంటున్న చైనా, సరిహద్దు దేశాలను భయపెడుతోంది. ముఖ్యంగా ఫిలిప్పీన్స్‌ని టార్గెట్ చేస్తోంది. గత కొంత కాలంలో ఫిలిప్పీన్స్ ప్రజా నౌకలు, విమానాలు, సాయుధ బలగాలు మరియు కోస్ట్‌గార్డ్‌పై చైనా ఆర్మీ దాడులకు తెగబడుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ సముద్రం నుంచి ఫిలిప్పీన్స్‌ని బయటకు నెట్టేందుకు చైనా ప్రయత్నిస్తోందని నిపుణులు చెబుతున్నారు. గతంలో గాల్వాన్ తరహా దాడినే ఫిలిప్పీన్స్‌పై చేయాలని చైనా భావిస్తోంది. 2020లో భారత్‌తో జరిగి దాడిలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. ఇదే సమయంలో భారత సైనికులు చేసిన దాడిలో దాదాపుగా 43 మంది చైనా బలగాలను భారత సైన్యం హతమార్చింది. అయితే, చైనా ఈ విషయాన్ని ఒప్పుకోలేదు. ఆ తర్వాత నుంచి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది.