China: పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ), చైనా మిలిటరీలో అవినీతి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో పలువురు ముఖ్య మిలిటరీ అధికారుల్ని విధుల నుంచి తొలగించారు. జిన్ పింగ్ అధికారంలో పలువురు ఉన్నతాధికారుల జాడ ఇప్పటికీ తెలియదు. ఇదిలా ఉంటే, తాజాగా చైనా ఉన్నతస్థాయి మిలిటరీ అధికారి మియావో లి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయాన్ని చైనా రక్షణ శాఖ గురువారం వెల్లడించింది. మియావో లి అనే అధికారి పొలిటికల్ వర్క్ డిపార్ట్మెంట్ డైరెక్టర్‌గా ఉన్నాడు. పీఎల్ఏ కార్యకలాపాలను ఇది పర్యవేక్షిస్తుంది. చైనా అత్యంత పవర్‌ఫుల్ సెంట్రల్ మిలిటరీ కమిషన్(సీఎంసీ)లో మియావో సభ్యుడిగా ఉన్నాడు.
ఇటీవల కాలంలో అవినీతి ఆరోపణలపై పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో విస్తృత స్థాయిలో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రక్షణ మంత్రి డాంగ్ జున్‌ని కూడా ప్రశ్నించారు. ఇప్పటి వరకు దాదాపుగా 9 మంది జనరల్స్, కొందరు అధికారులను తొలగించారు. గతేడాది చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సైన్యంలోని అవినీతిని యుద్ధ ప్రాతిపదికన అరికట్టాలనే ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి ఉన్నతస్థాయిలో విచారణ జరుగుతోంది.
మాజీ నౌకాదళ కమాండర్ డాంగ్ డిసెంబర్‌లో రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. ఈ నియామకానికి ముందు 7 నెలల ముందే పదవి చేపట్టిని లి షాంగ్ఫూని తొలగించారు. దీనికి ముందు వీ ఫెంఘేని కూడా ఇలాగే పార్టీ నుంచి తొలగించారు. చైనా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రాకెట్ ఫోర్స్ ఉన్నతాధికారి సన్ జిన్‌మింగ్ కూడా ఉన్నట్లుండి తొలగించబడ్డాడు. విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ కూడా ఇలాగే అదృశ్యమయ్యాడు. ఇలా ఉన్నతాధికారులు తొలగించబడటమో, కనిపించకుండా పోవడమే జరుగుతోంది.