India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..

  • మోదీ స్వతంత్ర విదేశాంగ విధానంపై చైనా కీలక వ్యాఖ్యలు..
  • భారత్-చైనా సంబంధాలు ఏ మూడో దేశం ప్రభావంతో నడవకూడదన్న మోడీ..
  • ఇరు దేశాలు భాగస్వాములుగా ముందుకు సాగాలని చైనా ఆకాంక్ష..
Modi Jinping

Modi Jinping

India-China Ties: భారత్-చైనా సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత విదేశాంగ విధానం స్వతంత్రమైందని, ఏ మూడో దేశం ప్రభావంతోనూ భారత్-చైనా సంబంధాలు నడవకూడదని ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటనపై బీజింగ్ ప్రశంసలు కురిపించింది. ఇరు దేశాలు భాగస్వాములుగా ముందుకు సాగాలని డ్రాగన్ కంట్రీ ఆకాంక్షించింది. న్యూఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈ సమావేశాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ మధ్య ద్వైపాకిక్ష చర్చలు నడిచాయి.

ఈ భేటీ భారత్, చైనా సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంతో ముందడుగుగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గ్వో జియాకున్ అభివర్ణించారు. గత ఏడేళ్లలో జిన్‌పింగ్ భారత్ పర్యటించడం ఇదే తొలిసారిన, అలాగే గత మూడేళ్లలో మోడీ, జిన్‌పింగ్ మధ్య మూడో సమావేశం అని చెప్పారు. భారత విదేశాంగ విధానం స్వతంత్రమైందని, ఎవరి ఒత్తిడికి గురికాకుండా నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని మోడీ పేర్కొన్నట్లుగా జియాకున్ తెలిపారు. భారత భూభాగం నుంచి చైనా వ్యతిరేక కార్యకలాపాలను భారత్ అనుమతించదని మోడీ చెప్పినట్లు చైనా పేర్కొంది. ఈ వ్యాఖ్యలకు చైనా ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు.

ఇదే సమయంలో భారత్, చైనాలు భాగస్వాములుగా ముందుకు సాగాలని మోడీ-జిన్‌పింగ్ సమావేశంలో కుదిరిన ఏకాభిప్రాయమని గ్వోజియాకున్ చెప్పారు. కజాన్‌లో ఇరు దేశాల మధ్య చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయని, టియాంజిన్‌లో, ఇప్పుడు ఢిల్లీలో కూడా రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరిచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇరువురు నాయకులు ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చలు జరిపినట్లు చైనా తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న రెండు దేశాలు గ్లోబల్ సౌత్‌లో కీలక పాత్ర పోషిస్తున్నా్యని పేర్కొంది. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకోవడం అత్యవసరమని ఇరు దేశాలు భావిస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.