NTV Telugu Site icon

Employee Salary: జీతం 50 వేలు.. వచ్చింది కోటిన్నర!

Chile Man 286 Times Paid

Chile Man 286 Times Paid

అదృష్టం తలుపు తట్టినప్పుడే సద్వినియోగపరచుకోవాలి. కాస్త నిర్లక్ష్యం వహించినా.. ఆ అదృష్టం చేజారిపోతుంది. ఈ సూత్రాన్ని ఒక ఉద్యోగి బాగా నెమరవేసుకున్నట్టు ఉన్నాడు. అందుకే, తనకు అదృష్ట దేవత తలుపుతట్టగానే తెలివి ప్రదర్శించాడు. దర్జాగా కోటిన్నరతో పరారయ్యాడు. ఒక కంపెనీలో జరిగిన ఓ తప్పు, అతనికి వరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశంలో కన్సార్సియో ఇండస్ట్రియల్‌ డే అలిమెంటోస్‌ అనే ప్రముఖ మైనింగ్‌ సంస్థ ఉంది. ఇందులో వేలాది మంది కార్మికులు, వందలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

ఇటీవల వేతనాల చెల్లింపు సమయం వచ్చింది. ఈ సందర్భంగా ఓ ఉద్యోగికి 500,000 పేసోలు (రూ.50 వేలు) జీతం కింద చెల్లించాల్సి ఉంది. కానీ.. అకౌంట్స్ విభాగం చేసిన ఓ తప్పు కారణంగా ఆ ఉద్యోగి ఖాతాలో ఏకంగా 165,398,851 పేసోలు (రూ.1.42 కోట్లు) జీతంగా పడ్డాయి. తనకు రెగ్యులర్‌గా వచ్చే జీతం కంటే ఇది 286 రెట్లు. అంత మొత్తం రావడంతో షాక్‌కి గురైన సదరు ఉద్యోగి.. తనకు ఎక్కువ జీతం పడిన విషయాన్ని అకౌంట్స్ విభాగానికి చెప్పాడు. తమ తప్పును గుర్తించిన అకౌంట్స్ విభాగం.. ఆ సొమ్మును తిరిగి తమ ఖాతాకు పంపాలని కోరింది. అయితే.. ఇంతలో ఆ ఉద్యోగి బుద్ధి మారింది. తాను జీవితాంతం కష్టపడినా అంత మొత్తం సంపాదించలేనని అనుకొని, వచ్చిన ఆ డబ్బుతో ఉడాయించాలని నిర్ణయించుకున్నాడు.

తొలుత బ్యాంకుకు వెళ్లి డబ్బు తిరిగి జమ చేస్తానని చెప్పిన ఆ ఉద్యోగి.. ఆ పని చేయకుండా హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అంతే, ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. రెండు రోజులైనా ఆ ఉద్యోగి నుంచి డబ్బులు తిరిగి రాకపోవడంతో అతడ్ని సంప్రదిస్తే.. ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. ఇంటికెళ్తే, అక్కడ కూడా లేడు. అటు, ఆఫీస్‌లో రిజైన్ లెటర్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో.. అతగాడు ఆ సొమ్ము తీసుకొని పరారయ్యాడని సదరు కంపెనీకి అర్థమైంది.