NTV Telugu Site icon

Justin Trudeau: వీగిపోయిన కెనడా ప్రధాని అవిశ్వాస తీర్మానం.. ఊపిరి పీల్చుకున్న ట్రూడో

Canada

Canada

Justin Trudeau: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు బిగ్ రిలీఫ్ దొరికింది. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ముందస్తు ఎన్నికలను డిమాండ్ చేస్తూ.. కన్జర్వేటివ్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టగా లిబరల్ పార్టీకి అనుకూలంగా 211 మంది ఓటేయగా.. మరో 120 మంది ప్రతిపక్షానికి సపోర్ట్ ఇచ్చారు. దీంతో ట్రూడో అవిశ్వాస తీర్మానంలో గెలిచారు. 338 సభ్యులున్న కెనడియన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రస్తుతం లిబరల్స్‌కు 154 మంది ఉండగా.. కన్జర్వేటివ్‌ పార్టీకి 119, ఎన్డీపీకి 24, బ్లాక్ క్యూబోకోయిస్ పార్టీకి మరో 34 సీట్లు ఉన్నాయి. నో కాన్ఫిడెన్స్ మోషనల్‌లో గెలిచిన అనంతరం ప్రభుత్వ వ్యవహారాల ఇన్ చార్జ్ కరీనా గౌల్డ్ మాట్లాడుతూ..దేశానికి మంచి రోజు.. ఎందుకంటే కెనడియన్లు ఎన్నికలను కోరుకుంటున్నారని నేను భావించడం లేదన్నారు.

Read Also: KBC 16: రూ.7 కోట్ల ప్రశ్నకు ఆన్సర్‌ తెలిసినా.. రూ. కోటితో నిష్క్రమించిన 22 ఏళ్ల కుర్రాడు..

ఇక, అవిశ్వాస తీర్మానం నుంచి ట్రూడో తప్పించుకున్నప్పటికీ.. ఆయన ముందున్న మార్గం అంత ఈజీగా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షమైన కన్జర్వేటివ్ పార్టీ సర్కార్ ను పడగొట్టడానికి మళ్లీ ప్రయత్నిస్తానని తెలిపింది. అలాగే, వేర్పాటువాద బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీ నేత మాట్లాడుతూ.. తమ డిమాండ్లను త్వరగా అంగీకరించకపోతే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి హెల్ప్ చేస్తామన్నారు. దీంతో జస్టిన్ ట్రూడో రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పదని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. కాగా, 2015 నవంబర్ లో తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ట్రూడో.. దేశంలో పెరుగుతున్న ధరలు, గృహ సంక్షోభం లాంటి పరిస్థితుల కారణంగా ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. దీంతో ఆయన పార్టీ ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల్లో ఓటమి పాలైంది. అయితే, ఇటీవల వెల్లడైన పలు సర్వేల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే లిబరల్ పార్టీ ఓడిపోతుందని తేలింది. దీంతో ముందస్తు ఎన్నికలు జరపాలని ప్రతిపక్ష పార్టీ కోరుతుంది.