NTV Telugu Site icon

Canada: కెనడా వెళ్లే విద్యార్థులకు షాక్.. స్టడీ ప‌ర్మిట్లు 10 శాతం తగ్గింపు

Canada

Canada

Canada: కెనడియన్ ఫెడరల్ సర్కార్ విదేశీ విద్యార్థుల‌కు షాక్ ఇచ్చింది. ఇంటర్ నేషనల్ స్టూడెంట్స్ ను మరింత తగ్గిస్తున్నట్లు పేర్కొనింది. తాత్కాలిక నివాసితుల రాకపోకల పరిమితి నిర్వహణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. 2025లో కొత్త అంతర్జాతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లు 10 శాతం మేర తగ్గించబోతున్నట్లు చెప్పారు. ఇమ్మిగ్రేషన్, శరణార్థులు, పౌరసత్వం కెనడా (ఐఆర్‌సీసీ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2024లో జారీ చేయాల‌ని లక్ష్యంగా పెట్టుకున్న 4,85,000 నుంచి 10 శాతం త‌గ్గితే కేవ‌లం 4,37,000 మందికి మాత్రమే స్టడీ పర్మిట్లు అందుతాయ‌ని కెనడకు చెందిన ఓ వార్తా సంస్థ కథనం ప్రసారం చేసింది. ఇక, 2025లో జారీ చేసే స్టడీ పర్మిట్‌ల సంఖ్య 2026లో కూడా ఎలాంటి మార్పులు ఉండదని ప్రకటించారు.

Read Also: Ukraine drone attack in Russia: రష్యాలో పెను విధ్వంసం సృష్టించిన ఉక్రెయిన్

కాగా, ఈ ఏడాది జ‌న‌వ‌రిలో దాదాపు 3,60,000 అండర్‌ గ్రాడ్యుయేట్ స్టడీ పర్మిట్‌లను కెనడియన్ ఫెడరల్ ప్రభుత్వం ఆమోదించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇది 2023లో జారీ చేయబడిన 5,60,000 స్టడీ పర్మిట్లతో పోలిస్టే దాదాపు 35 శాతం మేర తగ్గించబడింది. అయితే, కెనడా జనాభా 2024 మొదటి త్రైమాసికంలో 41 మిలియన్లకు పైగా ఉంది. ఇక, ఈ ఏడాది ప్రారంభంలో తాత్కాలిక నివాసితులలో భారీ పెరుగుదల కనిపించడంతో ఐఆర్‌సీసీ కీల‌క ప్రకటన వెలువరించింది. తాత్కాలిక నివాసితుల సంఖ్యపై ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొంది. త‌ద్వారా 2026 నాటికి కెనడా మొత్తం జనాభాలో 6.5 శాతంగా ఉన్న తాత్కాలిక నివాసితుల సంఖ్యను 5 శాతానికి తగ్గించాల‌ని అక్కడి సర్కార్ ల‌క్ష్యంగా పెట్టుకుంది.

Show comments