పొగ తాగితే ఆరోగ్యానికి హానికరం.. కళ్లు అరిగేలా, చెవులు చిల్లుపడేలా ప్రకటనలు వేస్తున్నా పొగరాయుళ్లు పట్టించుకోవడం లేదు. అంతెందుకు.. సిగరెట్ ప్యాక్ మీదే హెచ్చరిక సందేశాలున్నా బేఖాతరు చేస్తున్నారు. సిగరెట్ తీసుకొని, ప్యాకెట్‌ను పక్కన పడేసి, గుప్పుగుప్పుమంటూ పొగ వదిలేస్తున్నారు. సూటిగా, సుత్తి లేకుండా చెప్పాలంటే.. సిగరెట్ ప్యాక్‌లపై ఉండే సందేశాలకు ప్రాముఖ్యత లేకుండా పోయింది. అందుకే, కెనడా ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి, నేరుగా సిగరెట్లపైనే హెచ్చరికల్ని ముద్రించాలని నిర్ణయించింది.
‘‘సిగరెట్ ప్యాక్‌లపై ఉంటే హెచ్చరిక సందేశాలు కొత్తదనాన్ని, ప్రభావాన్ని దాదాపు కోల్పోయాయి. ఈ నేపథ్యంలోనే కొత్త పరిష్కార మార్గానికి తెరలేపాల్సి వచ్చింది. ఇక నుంచి సిగరెట్ల మీదే ‘పొగారు ఆరోగ్యానికి హానికరం’ అనే సందేశాన్ని ముద్రించాలని డిసైడ్ అయ్యాం. ప్యాకెట్‌లో ఉన్న సిగరెట్లను తాగుతున్నారే తప్ప, ఆ ప్యాక్‌లపై ఉన్న హెచ్చరికని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో సిగరెట్‌పై హెచ్చరికని ముద్రించాలని అనుకుంటున్నాం’’ అని కెనడా ఆరోగ్యం, వ్యసనాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2023 మధ్య కల్లా ఈ మార్పుల్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. అంతేకాదు.. ‘‘ప్రతీ పఫ్‌లోనూ విషం ఉంది’’ అనే హెచ్చరికను సైతం సిగరెట్‌పై ఉంచాలని కెనడా ప్రభుత్వం యోచిస్తోంది. ‘‘ఈ హెచ్చరికను ఎవరూ తోసిపుచ్చలేరు, ప్రతి స్మోకర్‌కు ప్రతి పఫ్ మీద ఈ హెచ్చరకి తప్పకుండా కనిపిస్తుంది’’ అని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.
ఈ తరహా విధానం ఏ దేశమూ అమలు చేయలేదని, తొలిసారి కెనడానే అమలు చేస్తోందని ఆయనన్నారు. కాగా.. కెనడా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 10 శాంతి మంది కెనడియన్లు క్రమం తప్పకుండా స్మోకింగ్ చేస్తున్నారు. అలాగే, పోగాకు సంబంధిత రోగాలతో ప్రతి ఏటా 48 వేల మంది చనిపోతున్నారు. 2035 నాటికి ఈ పొగ తాగే రేటుని సగానికి తగ్గించాలన్న ఉద్దేశంతో, కెనడా ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది.
