California Earthquake: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతం శనివారం సాయంత్రం భూకంపంతో ఒక్కసారిగా కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ప్రకంపనలు లాస్ ఏంజెలెస్‌తో పాటు పలు ప్రాంతాల్లోనూ స్పష్టంగా కనిపించాయి. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పలుచోట్ల దుకాణాల్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రభావం లాస్ ఏంజెలెస్ అంతర్జాతీయ విమానాశ్రయం (LAX)లోనూ కనిపించింది. విమానాశ్రయంలోని ఓ టెర్మినల్‌లో భవనం కంపించడంతో పైకప్పు టైల్స్ కింద పడిపోయాయి.
ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయపడిపోయారు. పసడీనాతో పాటు దక్షిణ కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భవనాలు కదలడం, చెట్లు ఊగిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి, దుకాణాల నుంచి బయటకు వచ్చారు. ప్రధాన భూకంపం తర్వాత పలుమార్లు భూమి కంపించింది. CNN నివేదిక ప్రకారం, మొదటి భూకంపం సంభవించిన 45 నిమిషాల్లోనే 2.5 నుంచి 3.7 తీవ్రత మధ్య నాలుగు ఆఫ్టర్‌షాక్‌లు నమోదయ్యాయి. అయితే, ఈ భూకంప ఘటనలో ఇప్పటివరకు ఎవరూ మరణించినట్లు లేదా గాయపడినట్లు సమాచారం లేదు.
భూకంపం నేపథ్యంలో లాస్ ఏంజెలెస్ అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాల నుంచి సిబ్బందిని రంగంలోకి దించారు. భవనాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి, ఎక్కడైనా నష్టం జరిగిందా అనే విషయాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. లాస్ ఏంజెలెస్ మేయర్ కూడా భూకంప పరిస్థితులపై స్పందించారు.
తమ బృందాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయని, భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం పెద్ద నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. థాంక్స్‌గివింగ్ సెలవుల వారంలో ఈ భూకంపం సంభవించడంతో దక్షిణ కాలిఫోర్నియాలో సాధారణం కంటే ఎక్కువగా ప్రజలు బయట కార్యకలాపాల్లో పాల్గొంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

