19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన

  • 2027లో చైనా అధ్యక్షతన 19వ సదస్సు
  • జిన్‌పింగ్ ప్రకటనకు సభ్య దేశాల మద్దతు
China To Host 19th Summit I

China To Host 19th Summit I

19th BRICS Summit in China: భారత్‌ వేదికగా 18వ BRICS సమ్మిట్‌ కొనసాగుతోంది. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఈ సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తోంది. రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ వాణిజ్యం, కృత్రిమ మేధస్సు, సరిహద్దు చెల్లింపులు, యుద్ధాలు, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై సభ్య దేశాల నేతలు చర్చిస్తున్నారు. ఇదే సమయంలో 19వ BRICS సమ్మిట్‌కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. 2027లో 19వ BRICS సమ్మిట్‌ను చైనా అధ్యక్షతన నిర్వహించనున్నట్లు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రకటించారు. చైనా ఆతిథ్యానికి BRICS సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు అంగీకారం తెలిపాయి.

2027లో చైనాలో 19వ BRICS సమ్మిట్

భారత్‌లో జరుగుతున్న 18వ BRICS సమ్మిట్ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 19వ సమ్మిట్‌పై ప్రకటన చేశారు. 2027లో చైనా అధ్యక్షతన BRICS సమావేశం జరుగుతుందని తెలిపారు. సమ్మిట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు త్వరలోనే ప్రారంభిస్తామని, సమయం దగ్గరపడిన తర్వాత సభ్య దేశాలకు అధికారిక ఆహ్వానాలు పంపిస్తామని చైనా వెల్లడించింది. చైనా నిర్వహించనున్న తదుపరి BRICS సమ్మిట్‌కు మొత్తం 11 సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు మద్దతు తెలిపాయి.

రామేశ్వరం ఆలయ బ్యాక్‌డ్రాప్ ముందు ఫొటోషూట్

సెప్టెంబర్ 12న భారత్ మండపంలో 18వ BRICS సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, BRICSలోని 11 సభ్య దేశాల అధినేతలకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామేశ్వరం ఆలయ బ్యాక్‌డ్రాప్ ముందు నేతల ఫొటోషూట్ నిర్వహించారు. ప్రధాని మోదీ రామేశ్వరం ఆలయ ప్రాముఖ్యతను ఇతర దేశాల నేతలకు వివరించారు. అనంతరం అన్ని దేశాల నేతలు భారత్ మండపంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సంరక్షణకు ప్రాధాన్యతను చాటిచెప్పారు.

మోడీ– జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ

BRICS సమ్మిట్‌ తొలి రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్, చైనా సంబంధాలతో పాటు BRICS భవిష్యత్‌ దిశపై చర్చించినట్లు సమాచారం. మిడిల్ ఈస్ట్‌లో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు చైనా, భారత్ సహా BRICS సభ్య దేశాలతో కలిసి పనిచేస్తుందని జిన్‌పింగ్ పేర్కొన్నారు. అలాగే ‘గ్రేటర్ BRICS’ లక్ష్య సాధన కోసం భారత్, చైనా పరస్పర సహకారంతో ముందుకు సాగవచ్చని తెలిపారు. రెండు దేశాలు ఒకదానికొకటి ఉన్న బలాలను నేర్చుకోవడంతో పాటు లోపాలను గుర్తించి మెరుగుపరుచుకునేందుకు సహకరించుకోవచ్చని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు.

జాయింట్ స్టేట్‌మెంట్, న్యూఢిల్లీ డిక్లరేషన్ విడుదల

సమ్మిట్‌ తొలి రోజు BRICS సభ్య దేశాల తరఫున జాయింట్ స్టేట్‌మెంట్ విడుదలైంది. అనంతరం న్యూఢిల్లీ డిక్లరేషన్ ను ప్రకటించారు. ఈ ప్రకటనలో ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, అంతర్జాతీయ ఘర్షణలకు చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కారం కనుగొనాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వివాదాలను మరింత తీవ్రతరం చేయకుండా శాంతియుత మార్గాల్లో పరిష్కరించాల్సిన అవసరాన్ని సభ్య దేశాలు స్పష్టం చేశాయి. అమెరికా టారిఫ్ విధానంపై కూడా BRICS దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విధానాలు ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నాయి. అదే సమయంలో సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాదం, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం, వారికి ఆశ్రయం కల్పించడం వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో కలిసికట్టుగా పనిచేయాలని సభ్య దేశాలు నిర్ణయించాయి.

ప్రధాని మోడీ అధ్యక్షతన గాలా డిన్నర్

BRICS సమ్మిట్‌ తొలి రోజు రాత్రి భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ప్రత్యేక గాలా డిన్నర్ నిర్వహించారు. ఈ విందులో BRICS సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల అధినేతలు పాల్గొన్నారు. భారత కేంద్ర మంత్రులు, 16 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లోక్‌సభ స్పీకర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అతిథులకు వివిధ రకాల భారతీయ వంటకాలు, సంప్రదాయ మిఠాయిలను వడ్డించారు. అయితే గాలా డిన్నర్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ కనిపించలేదు. క్రౌన్ ప్రిన్స్ స్వదేశానికి తిరిగి వెళ్లగా, జిన్‌పింగ్ విశ్రాంతి కోసం హోటల్‌కు వెళ్లినట్లు సమాచారం.

BRICS సమ్మిట్ ప్రాధాన్యత

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల పాత్రను పెంచడం, గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలను అంతర్జాతీయ వేదికపై బలంగా వినిపించడం BRICS సమ్మిట్‌ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న 18వ BRICS సమ్మిట్‌లో ఆర్థిక, రాజకీయ, భద్రతా, వాణిజ్య అంశాలపై కీలక చర్చలు జరుగుతున్నాయి. 2027లో చైనా అధ్యక్షతన జరిగే 19వ BRICS సమ్మిట్‌కు సంబంధించిన ప్రకటనతో తదుపరి సమావేశంపై కూడా స్పష్టత వచ్చింది.