Site icon NTV Telugu

Brad Pitt: ఏంజెలీనా నాకు హాని తలపెట్టాలని చూస్తోంది

Brad Pitt Vs Angelina Jolie

Brad Pitt Vs Angelina Jolie

ఇటీవల మాజీ జంట జానీ డెప్, అంబర్ హర్డ్‌ల పరువునష్టం దావా కేసు ప్రపంచవ్యాప్తంగా ఎంత అలజడి సృష్టించిందో అందరికీ తెలిసిందే! దాదాపు ఆరు వారాల పాటు సుదీర్ఘంగా సాగిన ఆ కేసులో చివరికి జానీ డెప్ గెలిచాడు. అంబర్ చేసిన ఆరోపణలన్నీ అసత్యమని ఫెయిర్‌ఫాక్స్ కోర్టు జ్యూరీ సభ్యులు తేల్చి, అతని పరువుకి నష్టం కలిగించినందుకు భారీ జరిమానా అంబర్‌కు విధించింది. చూస్తుంటే.. హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ ఈ కేసుని స్ఫూర్తిగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే, ఇతను తన మాజీ భార్య ఏంజెలీనా జోలిపై కోర్టులో ఓ సంచలన పిటిషన్ దాఖలు చేశాడు. తనకు హాని తలపెట్టేందుకు ఆమె ప్రయత్నిస్తోందని అతడు కుండబద్దలు కొట్టాడు.

అసలేం జరిగిందంటే.. ఈ మాజీ దంపతులు 2008లో ఫ్రాన్స్‌లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఓ వైన్ యార్డ్‌తో పాటు ‘షాటూ మిరావళ్’ను కొనుగోలు చేశారు. ఆ మిరావళ్‌లోనే 2014లో వాళ్లు వివాహం చేసుకున్నారు. అయితే.. కొన్నాళ్ళ తర్వాత ఈ జంట విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. కట్ చేస్తే.. గతేడాది ఏంజెలీనా వ్యాపారంలోని తన వాటాను టెన్యూట్ డెల్ మోండో అనే సంస్థకు అమ్మేసింది. దాన్ని సవాల్ చేస్తూ బ్రాడ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తమ వ్యాపారాన్ని ఎవరికీ అమ్మబోమని ముందే ఒప్పందం చేసుకున్నామని, అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఇలా వాటాల్ని అమ్మడం నమ్మకద్రోహమేనని బ్రాడ్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ కేసులో భాగంగానే బ్రాడ్ తాజాగా మరిన్ని సంచలన ఆరోపణలు చేశాడు.

మిరావళ్ తన కలల ప్రాజెక్టు అని, దానిని సక్సెస్ చేయడంలో ఏంజెలీనా పాత్రేమీ లేదని బ్రాడ్ వెల్లడించాడు. ప్రస్తుతం ఆ బిజినెస్ వందల కోట్లకు పడగలెత్తిందని, ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన రోజ్ వైన్ తయారీదారుల్లో ఒకటిగా తన కంపెనీ చోటు దక్కించుకుందని చెప్పాడు. కేవలం తన కృషి వల్లే అది సాధ్యమైందని చెప్పిన బ్రాడ్.. అందులో ఏంజెలీనా పాత్ర ఏమాత్రం లేదని తేల్చి చెప్పాడు. విడాకులయ్యాక తనకు తెలియకుండానే తన వాటాను వేరే సంస్థకు అమ్ముకోవడం దారుణమని ఆక్షేపించాడు.

Exit mobile version