Bomb attack in Pakistan, Train derailed: పాకిస్తాన్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. ఓ వైపు బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’, మరోవైపు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాకిస్తాన్ తాలిబాన్లు ఆ దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్సులో బాంబు పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది. బాంబు దాడిలో 15 మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు.
Read Also: Off The Record: రామగుండం ఎమ్మెల్యేకు పదవీ గండం
శుక్రవారం మధ్యాహ్నం జాఫర్ ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ రైలు బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోలాన్ జిల్లా గుండా వెళుతుండగా బాంబు పేలిందని అధికారులు తెలిపారు. ఈ రైలు క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తంఖ్వాలోని పెషావర్ కు వెళుతోంది. పేలుడు కారణంగా ఇంజిన్ తో సహా 8 రైలు బోగీలు పట్టాలు తప్పాయి. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ దాడికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత ప్రకటించుకుంది. బలూచిస్తాన్ ప్రావిన్సులో పాకిస్తాన్ ఆగడాలపై ఈ సంస్థ పోరాడుతోంది. బలూచిస్తాన్ ను సపరేట్ దేశంగా మార్చేందుకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రయత్నిస్తోంది. అక్కడ చైనా చేపడుతున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)పై ఈ సంస్థ దాడులకు పాల్పడుతోంది. దీంతో పాటు గ్వాదర్ పోర్టు నిర్మాణాలపై, చైనా జాతీయులపై తరుచుగా దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే బీఎల్ఏకు భారత్ సహకరిస్తుందని పాకిస్తాన్ విమర్శిస్తోంది.
