Site icon NTV Telugu

Joe Biden: గర్భస్రావం హక్కులపై బైడెన్‌ కీలక ఉత్తర్వులు

America President Joe Biden

America President Joe Biden

రాజ్యాంగ బద్ధంగా లభించిన గర్భస్రావ హక్కును కోల్పోయిన అమెరికన్ మహిళలకు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ గుడ్ న్యూస్ చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకోవడానికి మహిళలకున్న హక్కును కాపాడుతూ జో బైడెన్‌ శుక్రవారం పాలనా ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ రాజ్యాంగ హక్కును రెండు వారాల కిందట అమెరికా సుప్రీంకోర్టు రద్దుచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ హక్కును పరిరక్షించడానికి గట్టి చర్యలు తీసుకోవాలని తమ డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులు ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తుది నిర్ణయాధికారం అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు)దే కాబట్టి తన ఉత్తర్వుతో పరిమిత ప్రయోజనం మాత్రమే ఉంటుందని బైడెన్‌ వివరిస్తున్నారు.

India: షింజో అబే హత్యకు భారత్‌ సంతాపం.. జాతీయ జెండా అవనతం

అబార్షన్‌పై ఇప్పటికే 12 రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే యోచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వుల వల్ల పరిమిత ప్రయోజనం మాత్రమే ఉండే అవకాశం ఉంది. గర్భస్రావాన్ని సమ్మతించే రాష్ట్రాలకు వెళ్లి, అక్కడి సేవలను వినియోగించుకోవడంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తాజా ఉత్తర్వులు రక్షణ కల్పిస్తాయి. అలాగే, గర్భస్రావ హక్కును కాపాడడంలో కోర్టులో పోరాటం మొదలుపెట్టాలని న్యాయ, ఆరోగ్య-మానవ సేవల శాఖను బైడెన్ ఆదేశించారు.

Exit mobile version