NTV Telugu Site icon

Stormy Daniels: ట్రంప్‌ను ఇరికించిన శృంగార తార స్టార్మీ డేనియల్స్.. ఆమె జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు..

Stormy Daniels, Donald Trump

Stormy Daniels, Donald Trump

Stormy Daniels: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్ల తరుపున పోటీ చేద్ధాం అని భావిస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఓ శృంగార తార చేసిన ఆరోపణలు ఆయన్ను జైలు పాలయ్యేలా చేస్తున్నాయి. ఈ పోర్న్ స్టార్ పేరే స్టార్మీ డేనియల్స్. 2016 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ట్రంప్ తో శృంగారం గురించి చెప్పకుండా ఉండేందుకు ఆమెకు 1,30,000 డాలర్లను అందించినట్లు స్టార్మీ డేనియల్స్ ప్రకటించడం అమెరికాను ఓ కుదుపుకుదిపేసింది. ప్రస్తుతం మాన్ హట్టన్ అటార్నీ ట్రంప్ పై విచారణ ప్రారంభించేందుకు సిద్ధం కావడంతో స్టార్మీ డేనియల్స్ ప్రముఖంగా వినిపిస్తోంది. ట్రంప్ అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్న తరుణంలో మరోవైపు ఆయన మద్దతుదారులు నిరసనలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ట్రంప్ తో శృంగారం..

స్టార్మీ డేనియల్స్ అసలు పేరు స్టెఫానీ గ్రెగోరీ క్లిఫోర్డ్. ట్రంప్ కుమారుడు బారన్ జన్మించిన కొద్ది నెలల తర్వాత 2006లో ట్రంప్ తాను ఏకాభిప్రాయంతో శృంగారం చేసినట్లు స్టార్మీ వెల్లడించింది. ఆ సమయంలో ట్రంప్ వయసు 60, స్టార్మీ వయసు 27. పోర్న్ స్టార్ తన జ్ఞాపకాలతో అక్టోబర్ 2018న ‘ఫుల్ డిస్‌క్లోజర్’ అనే పుస్తకాన్ని ప్రచురించింది. ఈ బుక్ లోనే ట్రంప్ తో శృంగారం చేసినట్లు వెల్లడించింది. అయితే ట్రంప్ తో శృంగార వ్యవహారానికి సంబంధించిన విషయాలతో 2016 అధ్యక్ష ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్లాలని భావించింది.

బాల్యంతో లైంగిక దాడి..17 ఏళ్లకే పోర్న్ స్టార్..

స్టార్మీ డేనియల్స్ తాను చిన్నతనంలో ఎదుర్కొన్న లైంగికదాడి, వివక్ష, పేదరికం గురించి పుస్తకంలో వివరించింది. లూసియానా బాటన్ రూజ్ లో తన చిన్నతనంలో ఎదుర్కొన్న సంఘటనలను పుస్తకంలో పేర్కొంది. తండ్రితో విడాకులు తీసుకున్న తల్లి దగ్గర స్టార్మీ పెరిగింది. 9 ఏళ్ల వయసులోనే మిడిల్ ఏజ్ వ్యక్తి ఆమెను లైంగికంగా వేధించాడని, 17 ఏళ్ల వయసులోనే పోర్న్ స్టార్ గా తన కెరీర్ ను ప్రారంభించింది.

‘‘ద 40 ఇయర్స్ ఓల్డ్ వర్జిన్’’ అనే సినిమాతో స్టార్మీ హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ప్రారంభం అయిన కొన్ని రోజులకే ట్రంప్ తో ఫస్ట్ మీటింగ్ జరిగినట్లు తెలిపింది. ఆ తరువాత నాక్డ్అప్ సినిమాలో కూడా కనిపించింది. తన రాసలీలను బయటపెట్టకుండా ఉండేందుకు స్టార్మీకి లంచం ఇవ్వడంతో పాటు 2018లో ట్రంప్ చేసిన ట్విట్టర్ పోస్టుపై ఆమె ఫెడరల్ కోర్టులో పరువునష్టం దావా వేసింది.