Pakistan: ఆర్థిక సంక్షోభం, అప్పులు, రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కి జాక్‌పాట్ తగిలింది. సింధునదిలో ‘‘బంగారు నిల్వలు’’ ఉన్నట్లు తేలింది. ప్రాచీన సింధు లోయ నాగరికతకు ఈ నది తల్లిగా ఉంది. అద్భుతమైన నాగరికత ఈ నదీ ఒడ్డునే వెలిసింది. మెహంజోదారో, హరప్పా వంటి గొప్ప నగరాలు ఈ నాగరికతలో వెలిశాయి. ఋగ్వేదంలో కూడా సింధు నదీ ప్రస్తావన ఉంది. క్రీస్తుపూర్వం 3300-1300 మధ్య హరప్పా నాగరికతకు కీలకంగా సింధునది ఉంది.
ఇలాంటి పురాతన నది ఇప్పుడు పాకిస్తాన్ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. సింధు నదిలో భారీగా బంగారు నిల్వలు ఉన్నట్లు తేలింది. ఈ నదిలో 600 బిలియన్ పాకిస్తానీ రూపాయల విలువైన సంపద ఉందని అక్కడి మీడియా నివేదించింది. హిమాలయాల నుంచి పుట్టే సింధు నది పాకిస్తాన్‌లో ఎక్కువగా ప్రవహిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులో, అటాక్ జిల్లాలో గణనీయమైన మొత్తంలో బంగారం, ఇతర ఖనిజాలు ఉన్నాయని తెలుస్తోంది. బంగారు నిక్షేపాలు 32.6 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని పేర్కొన్నారు. 600 బిలియన్ పాకిస్తాన్ రూపాయల విలువైన ఈ బంగారం అటాక్‌లోని 32 కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉందని పంజాబ్ మైనింగ్ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ వెల్లడించారు.
Read Also: Fun Bucket Bhargav: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు.. ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల శిక్ష
పాకిస్తానీ మీడియా నివేదిక ప్రకారం… సింధు నదిలో లభించే బంగారం పాకిస్తాన్ ఉత్తర పర్వత ప్రాంతాల నుంచి వేగంగా ప్రవహించే నదిలోకి వస్తున్నట్లు, ఇది నదీ గర్భంలో సెటిల్ అవతున్నట్లు చెబుతోంది. 3200 కి.మీ విస్తరించి ఉన్న సింధు నది ప్రపంచంలో అతిపెద్ద నదుల్లో ఒకటి. బంగారం కలిగి ఉన్న సింధు నదిలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిషేధిస్తూ సెక్షన్ 144 అమలు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. బంగారం వంటి విలువైన ఖనిజాలు దేశ ఖజానాకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని పంజాబ్ ప్రావిన్స్ హోంశాఖ చెప్పింది.
శీతాకాలంలో, సింధు నదిలో నీటిమట్టం తగ్గుతున్నందున స్థానికులు నదీ గర్భం నుంచి అక్రంగా బంగారు కణాలను సేకరిస్తారనే భయం అక్కడి ప్రభుత్వంలో ఉంది. పాక్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే నివేదిక ప్రకారం.. హిమాలయ ప్రాంతం నుంచి బంగారం వస్తోందని, షెషావర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరుకుపోతుందని తెలిపింది. 6-10 మిలియన్ ఏళ్ల క్రితం రెండు టెక్టానిక్ ప్లేట్లు ఢీకొన్న తర్వాత హిమాలయాలు, సింధు నది ఉద్భవించాయి. నీటి ప్రవాహం కారణంగా హిమాలయాల నుంచి బంగారు కణాలు నదిలోకి చేరినట్లు తెలుస్తోంది. ఇలా జరిగే దృగ్విషయాన్ని ‘‘ప్లేసర్ డిపాజిట్స్’’గా పిలుస్తారు.