Bangladesh Violence: బంగ్లాదేశ్ మండిపోతోంది. షేక్ హసీనా డిసెంబర్లో స్వదేశానికి వెళ్తానని ప్రకటించడంతో ఒక్కసారిగా ఆ దేశంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, దహనాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నరైన్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ వారం ప్రారంభంలో ఓ పార్టీ ర్యాలీపై జరిగిన దాడిలో అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) నేతలు మరణించారు. దీని తర్వాత 50కి పైగా ఇళ్లకు, పలు దుకాణాలకు దుండగులు నిప్పుపెట్టారు. షేక్ హసీనాకు చెందిన నిషేధిత అవామీ లీగ్ పార్టీ నేతలు, కార్యకర్తలకు చెందిన ఆస్తులనే టార్గెట్ చేస్తూ దహనాలకు పాల్పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం కలియా మున్సిపాటిలిటీ పరిధిలోని బెండార్ చార్ గ్రామంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. మాజీ అవామీలీగ్ ఎంపీ కబీరుల్ హక్ ముక్తికి చెందిన పూర్వీకుల ఇళ్లు కూడా దగ్ధమైంది.
అవామీ లీగ్ వర్సెస్ బీఎన్పీ..
బంగ్లాదేశ్ రాజకీయాల్లో అవామీలీగ్, బీఎన్పీ మధ్య ఎన్నో ఏళ్లుగా శత్రుత్వం ఉంది. ఇప్పుడు మరోసారి ఇది బహిరంగంగా కనిపిస్తోంది. షేక్ హసీనా భారత్ వచ్చిన తర్వాత, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ విజయం సాధించింది. తారిక్ రెహ్మాన్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే, తాజాగా జరుగుతున్న దాడులు అవామీలీగ్‌ను లక్ష్యంగా చేసుకుని చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్ స్టూడెంట్ లీగ్ అధ్యక్షుడు హుస్సేన్ సద్దాం సంచలన ఆరోపణలు చేశారు. అవామీలీగ్ మద్దతుదారులకు చెందిన వందలాది ఇళ్లను స్థానిక బీఎన్పీ కార్యకర్తలు కాల్చివేశారని, ఇళ్లను ధ్వంసం చేసి, విలువైన వస్తువుల్ని దోచుకున్నారని ఆరోపించారు. బాధితుల్లో హిందూ మైనారిటీకి చెందిన కుటుంబాలు కూడా ఉన్నాయని చెప్పారు.
షేక్ హసీనా రిటర్న్‌పై బంగ్లాలో ఉద్రిక్తత..
మాజీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వస్తుండటంతో ఆ దేశంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. డిసెంబర్లో తాను బంగ్లాకు వస్తున్నట్లు హసీనా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె మద్దతుదారులు, అవామీలీగ్, దాని అనుబంధ కార్యకర్తలు బంగ్లాలో నిరసన తెలుపుతున్నారు. ఇటీవల వరసగా బాంబు దాడులు, ఘర్షణలు జరిగాయి. ఈ దాడుల వెనక అవామీలీగ్ ఉందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అవామీలీగ్ మళ్లీ పెరగకుండా దానిని అంతం చేయాలని బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ పిలుపునిచ్చారు.

