NTV Telugu Site icon

Sheikh Hasina: షేక్ హసీనాని ఇండియా నుంచి రప్పించేందుకు బంగ్లాదేశ్ చర్యలు..

Sheikh Hasina

Sheikh Hasina

Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా ఉద్యమం షేక్ హసీనా ప్రధాని పదవికి ఎసరు తెచ్చింది. రిజర్వేషన్ కోటా హింసాత్మకంగా మారడంతో, ఆ దేశ ఆర్మీ అల్టిమేటం ఇవ్వడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం నోబెల్ విన్నర్ మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే, షేక్ హసీనాని తమకు అప్పగించాలని పలువురు బంగ్లా నేతలు భారత్‌కి అల్టిమేటం విధిస్తున్నారు. స్థాయి మరిచి భారత్‌ని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ దేశంలోని బీఎన్పీ పార్టీ, జమాతే ఇస్లామీ పార్టీ నేతలు హసీనాను అప్పగించాలని కోరుతున్నాయి.

Read Also: MPOX: అలర్ట్..భారత్ లోకి మంకీపాక్స్ ఎంట్రీ! విదేశాల నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి వైరస్ లక్షణాలు!

రిజర్వేషన్ కోటా అల్లర్లలో జరిగిన మరణాలకు షేక్ హసీనా కారణం అని చెబుతూ ఆమెపై వందలాది కేసులు నమోదయయ్యాయి. వీటిలో ఎక్కువగా హత్య కేసులు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సామూహిక హత్యలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెని విచారించేందుకు బంగ్లాదేశ్ షేక్ హసీనాను భారత్ నుంచి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌కి కొత్తగా నిమమితులైన చీఫ్ ప్రాసిక్యూటర్ ఆదివారం తెలిపారు. ఆగస్టు 05న ఆమె భారత్ పారిపోయి వచ్చారు. నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద ఆమెను తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటామని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చీఫ్ ఎండీ తాజుల్ ఇస్లాం పేర్కొన్నారు.

“సామూహిక హత్యలు మరియు మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు సంబంధించి షేక్ హసీనాతో సహా నిందితులందరిపై అరెస్టు వారెంట్లు జారీ చేయడానికి మేము అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో దరఖాస్తు చేస్తాము,” అని విలేకరులు సమావేశంలో అన్నారు. కొత్త కేసుల విచారణకు సంబంధించి ప్రస్తుత అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చట్టానికి సవరణలపై ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాత్కాలిక ప్రభుత్వ ఆరోగ్య సలహాదారు నూర్జహాన్ బేగం ప్రకారం.. ఈ అల్లర్లలో 1000 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. గత నెలలో హసీనా, మరో తొమ్మిది మందిపై మారణహోమం, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభమైంది.

Show comments