Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్‌లో రాజకీయ కల్లోలం..

  • షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అధ్యక్షుడి పిలుపు..
  • బంగ్లాలో సంచలనంగా మారిన వార్త..
  • అధికార పార్టీ బీఎన్పీ తీవ్ర ఆగ్రహం..
  • త్వరలో అధ్యక్షుడు రాజీనామా చేస్తారని ప్రచారం..
Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరోసారి రాజకీయ కల్లోలం మొదలైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్, మాజీ ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కథనాలు అక్కడి రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఈ పరిణామం పట్ల అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎస్పీ) తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధ్యక్షుడు రాజీనామా చేయాలని బీఎన్పీ డిమాండ్ చేస్తోంది. షాబుద్దీన్ పదవీ కాలం ముగియడానికి మరో రెండేళ్లు ఉంది. దీనికి ముందే ఆయన రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

షేక్ హసీనా పాలనా సమయంలోనే షాబుద్దీన్ ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విద్యార్థి ఉద్యమ సమయం తర్వాత కూడా రాజ్యాంగ పదవిలో కొనసాగుతున్న ఏకైక వ్యక్తి ఆయనే. 2024 ఆగస్టు విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్ హసీనా భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఈ ఏడాది చివర్లో బంగ్లాదేశ్ తిరిగి వెళ్తానని ఆమె ప్రకటించారు.

అధ్యక్షుడు, హసీనా మధ్య సీక్రెట్ కాల్.?

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అధ్యక్షుడు, హసీనా మధ్య సీక్రెట్ సంభాషణ జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, దీనిని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. బంగ్లా వార్తా పత్రిక ప్రథమ్ ఆలో నివేదిక ప్రకారం.. అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ తన ఇటీవలి లండన్ పర్యటన సందర్భంగా ప్రవాసంలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనాతో ఫోన్‌లో మాట్లాడారని చెప్పింది. 1971 విమోచన యుద్ధ వీరుడు, దిగువ న్యాయవ్యవస్థ మాజీ న్యాయమూర్తి అయిన షహాబుద్దీన్, ఐదేళ్ల పదవీకాలానికి ఏప్రిల్ 2023లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన ఆరోగ్య కారణాల వల్ల త్వరలోనే రాజీనామా చేయవచ్చని చెప్పింది. అయితే, ఈ వార్తల్ని అధ్యక్షుడి కార్యాలయం ధ్రువీకరించలేదు, అలాగని ఖండించలేదు.

ప్రభుత్వం సైలెన్స్:

ఈ విషయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా సైలెంట్‌గా ఉంటోంది. హోం మంత్రి షలాహుద్దీన్ అహ్మద్ దీనిని ఖండించలేదు, అంగీకరించలేదు. నాకు తెలియదని మాత్రమే చెప్పారు. అయితే, ఆయన ఆరోగ్య కారణాల వల్ల లేదా మరే ఇతర కారణాల వల్ల రాజీనామా చేయాలని అనుకున్నా, రాజ్యాంగం ప్రకారం ఆయనకు అవకాశం ఉందని అన్నారు. కానీ ఇలాంటి విషయం మాకు తెలియనది చెప్పారు. కానీ బీఎన్పీ అంతర్గత సమావేశాల్లో రాజీనామా గురించి బాగా చర్చ నడుస్తోంది. బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం, రాష్ట్రపతి రాజీనామా చేస్తే, కొత్త దేశాధినేత ఎన్నికయ్యే వరకు పార్లమెంట్ స్పీకర్ హఫీజుద్దీన్ అహ్మద్ తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తారు.