Bangladesh: బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..

  • బంగ్లాదేశ్‌లో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం..
  • గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 8–16 గంటల వరకు విద్యుత్ కోతలు.
  • హార్ముజ్ సంక్షోభం, గ్యాస్ కొరతలో బంగ్లాదేశ్‌లో చీకట్లు..
Bangladesh

Bangladesh

Bangladesh:  బంగ్లాదేశ్ తీవ్ర విద్యుత్ సంక్షోభంతో అల్లాడుతోంది. దేశవ్యాప్తంగా 10-16 గంటల పాటు విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. విద్యుత్ కోతల కారణంగా దేశవ్యాప్తంగా దుకాణాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌ను రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అమలు చేస్తోంది. విద్యుత్ కొరత కారణంగా ఇకపై బంగ్లాదేశ్‌లోని దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. దేశంలోని అన్ని బిల్ బోర్డులను సాయంత్రం 7 గంటల లోపు ఆపేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని డెకరేషన్ లైట్లు కూడా పూర్తిగా నిలిపేయాలని చెప్పింది. బంగ్లాదేశ్ విద్యుత్, ఇంధన మరియు ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ బుధవారం సాయంత్రం జారీ చేసిన ఒక ఉత్తర్వులో ఈ నిర్ణయాలను ప్రకటించింది.

విద్యుత్ కొరత ఎందుకు?

బంగ్లాదేశ్‌కు వచ్చే ఇంధనం దాదాపుగా గల్ఫ్ దేశాల నుంచే వస్తోంది. ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధి మూతపడింది. బంగ్లాదేశ్‌లో విద్యుత్ ఉత్పత్తి గ్యాస్‌పై ఆధారపడి ఉంది. గ్యాస్ కొరత కారణంగా విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ గతంలో 5000 మెట్రిక్ టన్నుల డీజిల్ పంపింది. కొన్నాళ్ల పాటు ఈ సాయంతో నెట్టుకొచ్చింది. 33092 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇంధన కొరత కారణంగా అందులో సగభాగాన్ని మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోంది.

భారత సాయం కోసం బంగ్లా చూపు..

సంక్షోభాన్ని అధిగమించడానికి బంగ్లాదేశ్ భారత్‌ను కోరింది. గత వారం గత వారం భారత హైకమిషనర్ దినేశ్ త్రివేదితో బంగ్లాదేశ్ ఇంధన మంత్రి ఇక్బాల్ హసన్ మహ్మూద్ సమావేశమైన సందర్భంగా ఈ అభ్యర్థన చేశారు.భారత్ నుంచి డీజిల్ సరఫరా కోసం ఇప్పటికే పైప్‌లైన్ ఉందని, దాని ద్వారా మరింత డీజిల్ అందించాలని మంత్రి కోరారు.

ఇండియా–బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ 2017లో షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభమైంది. బంగ్లాదేశ్ ఇంధన భద్రతలో ఈ పైప్‌లైన్ కీలక పాత్ర పోషిస్తోంది. 15 ఏళ్ల ఒప్పందం ప్రకారం భారత్ ప్రతి సంవత్సరం 1,80,000 మెట్రిక్ టన్నుల డీజిల్‌ను ఢాకాకు పంపాల్సి ఉంది. మిడిల్ ఈస్ట్ సంక్షోభం సమయంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో భారత్ ఇప్పటికే 30,000 టన్నులకు పైగా డీజిల్‌ను బంగ్లాదేశ్‌కు పంపింది.