NTV Telugu Site icon

Bangladesh: ఉద్రిక్తంగా బంగ్లాదేశ్.. ప్రపంచానికి దూరంగా ఆ దేశం..

Bangladesh

Bangladesh

Bangladesh: రిజర్వేషన్లపై నిరసనలు బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తంగా మారాయి. 1970లలో బంగ్లాదేశ్ స్వాతంత్య్రంలో పాల్గొన్న సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కోటా కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ, అక్కడి యూనివర్సిటీ విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో 110 మంది మరణించారు. మరోవైపు అల్లర్లను అణిచేసేందుకు ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. దేశం మొత్తం కర్ఫ్యూ విధించింది.

గురువారం నుంచి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోయాయి. బహిరంగ సభలపై నిషేధం కొనసాగుతోంది. బంగ్లా మీడియా సంస్థల వెబ్‌సైట్స్ అప్డేట్ కాలేదు. వాటి సోషల్ మీడియా హ్యాండిల్స్ నిష్ర్కియంగా ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కనెక్ట్ కవాడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ మిగతా ప్రపంచంలో సంబంధాలను కోల్పోయింది. దాదాపుగా 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్‌‌ని ఇంటర్నెట్‌కి దూరంగా ఉండచడం కఠినమైన చర్య అని, 2011 ఈజిప్టు విప్లవం నుంచి మనం ఇలాంటివి చూడలేదని USC విటెర్బిస్‌లోని నెట్‌వర్కింగ్ మరియు సైబర్ సెక్యూరిటీ విభాగానికి చెందిన చీఫ్ సైంటిస్ట్ జాన్ హైడెమాన్ అన్నారు.

Read Also: Harbhajan Singh: ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కి హర్భజన్ సింగ్ ప్రశ్న..విషయమేంటంటే..?

బంగ్లాదేశ్ ఆస్పత్రుల డేటా ప్రకారం ఈ ఆందోళనల్లో వేలాది మంది గాయపడ్డారని, ఢాకా మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి శుక్రవారం సాయంత్రం నుంచి 27 డెడ్ బాడీలు వచ్చాయని తెలిపాయి. ఈ ఏడాది వరసగా నాలుగోసారి ప్రధానిగా షేక్ హసీనా బాధ్యతలు స్వీకరించారు. దేశ జనాభాలో 5వ వంతు యువకులు అధిక నిరుద్యోగంలో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూ ఉంది. వీధుల్లోకి వచ్చేవారి గుర్తింపు కార్డులను ఆర్మీ చెక్ చేస్తో్ంది. నిత్యావసరాల కోసం శనివారం మధ్యాహ్నం రెండు గంటలు కర్ఫ్యూని సడలించారు.

స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లను కల్పించే విధానాన్ని హసీనా ప్రభుత్వం 2018లో రద్దు చేసింది, అయితే గత నెలలో మళ్లీ పునరుద్ధరించడంతో వివాదం మొదలైంది. నిరసనల కారణంగా స్పెయిన్, బ్రెజిల్ దౌత్య పర్యటనల్ని ప్రధాని హసీనా విరమించుకున్నట్లు విదేశాంగ మంత్రి హసన్ మహమూద్ తెలిపారు. మరోవైపు ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతల్ని, విద్యార్థుల్ని అరెస్ట్ చేసినట్లు ఆ పార్టీ నేత తారిక్ రెహమాన్ ఆరోపించారు. అంతర్జాతీయ హక్కుల సంఘాలు ఇంటర్నెట్ సస్పెన్షన్ మరియు భద్రతా దళాల చర్యలను విమర్శించాయి. హింస మరియు ప్రాణనష్టం పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని యూరోపియన్ యూనియన్ తెలిపింది.