Saudi Arabia: సౌదీ అరేబియాలో ఇటీవల బంగ్లాదేశ్‌కు చెందిన నజ్రుల్ ఇస్లాం, స్వీటీ అక్తర్ అనే ఇద్దరికి మరణశిక్ష అమలు చేసింది. ఈ వ్యవహారం రెండు దేశాల మధ్య దౌత్యవివాదానికి కారణమైంది. బంగ్లాదేశ్ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పవిత్ర మక్కాలోని మసీదులో ‘‘అనైతిక చర్యలకు’’ పాల్పడ్డారనే అభియోగాలపై ఈ ఇద్దరికి సౌదీ మరణశిక్ష అమలు చేసింది. అయితే, ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్ సౌదీ అరేబియాకు 6 ప్రశ్నల్ని సందించింది. ఈ మొత్తం ఆపరేషన్, కోర్టు తీర్పు, న్యాయ సహాయం, మృతదేహాల స్థితికి సంబంధించిన సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేసింది.
బంగ్లాదేశ్ అడిగిన 6 ప్రశ్నలు..
1) ఇద్దరు పౌరులపై ఏ నేరాలకు సంబంధించిన కేసులు నమోదు చేశారు? ఆరోపించిన ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగింది.?
2) అరెస్టులు ఎప్పుడు జరిగాయి? కోర్టు తీర్పుల్ని ధ్రువీకరించే పత్రాలు ఏక్కడ?
3) ఇద్దరు మృతదేహాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? వాటిని బంగ్లాదేశ్‌కు అప్పగిస్తారా? సౌదీలోనే ఖననం చేస్తారా?
4) తల నరికి శిక్ష అమలు చేశారా? లేక ఇతర పద్ధతులు అనుసరించారా?
5) విచారణ సమయంలో న్యాయవాది లేదా న్యాయ సహాయం అందించారా? వారు ఏదైనా సాయం కోరారా?
6) సెప్టెంబర్‌లో సౌదీ అధికారులకు పంపిన బంగ్లాదేశ్ ఖైదీల జాబితాలో వారి పేర్లు ఉన్నప్పటికీ, మరణశిక్ష వివరాలు ఎందుకు ప్రస్తావించలేదు? సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటనతో దీనికి ఎందుకు వైరుద్యం ఉంది? అని బంగ్లాదేశ్ ప్రశ్నించింది.
అక్టోబర్ 14న మరణశిక్ష అమలు..
అక్టోబర్ 14న మక్కాలోని ఒక మసీదులో అసభ్యకరమైన నేరానికి పాల్పడుతూ ఇద్దరు పట్టుబడిన ఇద్దరికి మరణశిక్ష విధించినట్లు సౌదీ ప్రకటించింది. అయితే, ఈ ఘటనపై బంగ్లాదేశ్‌కు ముందస్తు సమాచారం అందించకపోవడంపై ఆ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఇదే సమయంలో సౌదీ అరేబియాలో ఖైదీలుగా ఉన్న మరో 20 మంది బంగ్లాదేశ్ పౌరుల వివరాలను కూడా ప్రభుత్వం కోరింది. వారి పేర్లు ఖైదీల జాబితాలో ఉన్నప్పటికీ, శిక్షలకు సంబంధించిన వివరాలు స్పష్టంగా లేవని బంగ్లాదేశ్ ఆరోపించింది.

