Balendra Shah: సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. జెన్-జీ యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగిన కాల్పుల్లో 19 మంది ఆందోళనకారులు మరణించడంతో, ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సోషల్ మీడియాపై బ్యాన్ మాత్రమే కాకుండా, ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతి, రాజకీయ నేతల పిల్లల విలాసాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. అల్లర్లు తీవ్రం కావడంతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఆ తర్వాత అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కూడా రాజీనామా చేశారు. మంత్రులు, కీలక ప్రజాప్రతినిధులు కూడా తమ పదవుల నుంచి తప్పుకున్నారు.
ఈ నేపథ్యంలో నేపాల్‌కు కొత్త ప్రధాని ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. అందరి కళ్లు ఇప్పుడు రాజకీయ నాయకుడు, నేపాల్ మేయర్ బలేంద్ర షాపై ఉన్నాయి. బలేంద్ర షానే నేపాల్‌కు కాబోయే ప్రధాని అని తెలుస్తోంది. యువతలో మంచి గుర్తింపు ఉన్న ఈయన, తాజా ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. సోమవారం సాయంత్రం, నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేయడంతో, బలేంద్ర తన పేస్ బుక్ పోస్ట్ ద్వారా ప్రదర్శనకారులకు సంఘీభావం ప్రకటించారు. ‘‘ ఉద్యమ నిర్వాహకులు 28 ఏళ్ల లోపు వ్యక్తులు పాల్గొనాలని చెప్పడంతో తాను హాజరుకాలేకపోయానని, వారి గళం వినడం అవసరం’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘నేను వారి ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆలోచనలను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు, చట్టసభ సభ్యులు మరియు ప్రచారకులు ఈ ర్యాలీని వారి స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగించొద్దు’’ అని అన్నారు. నేపాల్‌లోని యువత కూడా బలేంద్ర షా తదుపరి తమ ప్రధాని అని సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. నేపాల్ ప్రజలు ఆయన వెంటే ఉంటారని చెబుతున్నారు.
Read Also: Salman Lala: గ్యాంగ్‌స్టర్ అంత్యక్రియలు వేలాది మంది.. బాలివుడ్ నటుల సంతాపం.. ఇంతకీ ఎవరితను?
ఎవరు ఈ బలేంద్ర షా:
సోమవారం, ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత బలేంద్ర షా వార్తల్లో వ్యక్తిగా ట్రెండింగ్‌లోకి వచ్చారు. బలేంద్ర షాను బలెన్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఆయన ఖాట్మాండు మెట్రోపాలిటన్ సిటీ మేయర్‌గా ఉన్నారు. 1990లో ఖాట్మాండులో జన్మించిన ఆయన నేపాల్ లో సివిల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. ఆ తర్వాత భారత్‌లోని విశ్వేశ్వరయ్య టెక్నాలజీ యూనివర్సిటీ నుంచి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు.
రాజకీయాల్లో చేరక ముందు హిప్ హాప్ రాపర్‌గా, గీత రచయితగా అందరికి సుపరిచితం. తన సంగీతం ద్వారా తరుచుగా అవినీతి, అసమానతలు వంటి సమస్యల్ని లేవనెత్తేవారు. 2022లో ఖాట్మాండు మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 61,000 ఓట్లతో గెలిచారు. ఇతను సబీనా కాఫ్ల్‌ని వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. పౌర సమస్యలు, రాజకీయ చర్చల ద్వారా ప్రజలతో నిరంతరం టచ్‌లో ఉంటారు.
