Site icon NTV Telugu

Russia – Ukraine War: అనవసర ప్రయాణాలొద్దు.. భారతీయులకు హెచ్చరిక జారీ

Indian Embassy Ukraine

Indian Embassy Ukraine

Avoid Non-Essential Travel To and Within Ukraine Says Indian Embassy: క్రిమియా, రష్యాను అనుసంధానం చేసే కెర్బ్ వంతెనను ధ్వంసం చేయడంతో.. ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే! దీంతో ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. అత్యవసరమైతే తప్ప అన‌వ‌స‌ర ప్రయాణాలు చేయొద్దని హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక అధికారులు జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, కీవ్‌లోని భార‌త రాయ‌బార కార్యాల‌యంతో నిత్యం సంప్రదింపులు కొనసాగించాలని కోరింది. తమ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎంబసీకి తెలియజేయాలని, ఫలితంగా సహాయం చేసే విషయంలో ఎలాంటి గందరగోళం ఉండదని పేర్కొంది.

ఇదిలావుండగా.. కెర్బ్ వంతెను కూల్చినందుకు గాను ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ నగరంతో పాటు పలు చోట్ల రష్యా మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. సుమారు 84కిపైగా మిస్సైల్స్‌ ఉక్రెయిన్‌ భూభాగంలో విధ్వంసం సృష్టించగా.. ఈ దాడుల్లో సుమారు పది మంది పౌరులు మృతి చెందారు. మరో 60 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. త‌మ‌ను రెచ్చగొట్టేలా ఉక్రెయిన్ ఉగ్ర చర్యలకు పాల్పడిందని, అందుకు ప్రతిగానే ఈ క్షిపణి దాడులు చేయాల్సి వచ్చిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ తెలిపారు. ఇంకోసారి అలాంటి దాడులకు పాల్పడొద్దని కూడా ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ దాడుల్ని ఖండించారు. తమ దేశాన్ని భూభాగంలో లేకుండా చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని, క్షిపణి దాడుల్లో తమ ఉక్రెయిన్ పౌరుల్లో చాలామంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version