NTV Telugu Site icon

Australia: ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. 16ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

Australia

Australia

ప్రస్తుతం మనిషి.. మనుషులతో కంటే.. మొబైల్‌తోనే ఎక్కువ గడుపుతున్నాడు. చిన్న పిల్లల దగ్గర నుంచి నడి వయసులో ఉన్న పెద్దోళ్ల వరకు ఫోన్‌తోనే గడుపుతున్నారు. అంతగా మనుషులు మొబైల్‌కు బానిసైపోయారు. దీనికి తోడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. రీల్స్ చేయడం.. లేదంటే ఏవైనా ప్రోగ్రామ్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం.. ఇలా పిల్లలు బిజీ అయిపోతున్నారు. దీంతో మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఎప్పుడైనా సోషల్ మీడియా యాప్‌ల్లో అంతరాయం కలిగితే… ఎంత గాబరాపడిపోతుంటారో. దీని బట్టి చెప్పొచ్చు. సోషల్ మీడియా ప్రభావం మనుషులపై ఎంతగా ఉందో చెప్పడానికి ఇంత కంటే మరో ఉదాహరణ లేదు.

సోషల్ మీడియా యుగంలో పిల్లల భవిష్యత్ దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా వెళ్తోంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధించాలని ఆస్ట్రేలియా యోచిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్ మొదలైన సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించకుండా 16 ఏళ్లలోపు పిల్లలను నిషేధించడానికి ప్రపంచంలోనే ప్రముఖ చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఆస్ట్రేలియా తెలిపింది. ఈ చట్టాన్ని ఈ ఏడాదే ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. చట్టం చేయగానే 12 నెలల్లోనే అమలులోకి రానుంది. చట్టసభ సభ్యులు ఆమోదించిన తర్వాత తల్లిదండ్రుల సమ్మతితో పిల్లలకు వయోపరిమితిపై ఎలాంటి మినహాయింపులు ఉండవు.

సోషల్ మీడియా ప్రభావం కారణంగా యువత చెడిపోతుందన్న ఆలోచనతోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. అశ్లీల చిత్రాలు, దృశ్యాలు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ అవుతుండడంతో ఆస్ట్రేలియా ఆందోళన వ్యక్తం చేసింది. యువత పెడదారిన పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే తల్లిదండ్రులు, మేధావులతో ఈ అంశంపై ప్రభుత్వం చర్చించింది. సోషల్ మీడియా కారణంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నట్లు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. కచ్చితంగా సోషల్ మీడియాపై నిషేధం విధించాలని ప్రభుత్వానికి తల్లిదండ్రులు, మేధావులు సూచించారు. చట్టం అమల్లోకి వస్తే.. వయసును నిర్ధారించడానికి ప్రత్యేకమైన eSafety కమీషనర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే eSafety కమీషనర్ జరిమానాలు విధించనుంది. నవంబర్‌లోనే ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్నారు.

Show comments