NTV Telugu Site icon

Asif Ali Zardari: ‘‘మిస్టర్ టెన్ పర్సెంట్’’ మళ్లీ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయ్యాడు.. వివాదాలు, అవినీతికి కేరాఫ్ జర్దారీ..

Asif Ali Zardari

Asif Ali Zardari

Asif Ali Zardari: పాకిస్తాన్ అధ్యక్షుడిగా రెండోసారి ఆసిఫ్ అలీ జర్దారీ శనివారం ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో భర్తగా పేరు సంపాదించుకున్న జర్దారీ, 2007లో ఆమె బాంబు దాడిలో మరణించిన తర్వాత పాకిస్తాన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాడు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చీఫ్‌గా ఉన్న ఆయన భార్య మరణం తర్వాత వచ్చిన సానుభూతితో 2008-13 వరకు పాక్‌కి అధ్యక్షుడిగా పనిచేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 8న జరిగిన పాక్ నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు, నవాజ్ షరీఫ్, భుట్టో పార్టీలకు క్లియర్ కట్ మెజారిటీ రాలేదు. దీంతో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N), జర్దారీ యొక్క పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ రెండు పార్టీల ఒప్పందంలో భాగంగా నవాజ్ షరీఫ్ తమ్ముడు షహబాజ్ షరీఫ్ రెండోసారి ప్రధాని కాగా, ఆసిఫ్ అలీ జర్దారీ అధ్యక్షుడు అయ్యాడు. ఆదివారం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

అవినీతికి ‘మిస్టర్ టెన్ పర్సెంట్’:

ఆసిఫ్ అలీ జర్దారీ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతి, కిడ్నాప్ కుట్రలు వంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 2008-13 వరకు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పలు కాంట్రాక్టుల్లో 10 శాతం కమీషన్ తీసుకున్నాడనే ఆరోపణలతో పాక్ ప్రజలు అతడిని ‘మిస్టర్ టెన్ పర్సెంట్’ అని ఎద్దేవా చేయడం ప్రారంభించారు. అవినీతి, నేరాలకు పాల్పడినా తనకు ఉన్న పొలిటికల్ టాలెంట్‌లో అన్ని ఆరోపణల నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యేవాడు.

ఇక జర్దారీ 1990లో ఒక బిజినెస్ మ్యాన్ కాలికి బాంబు పెట్టి దోచుకునే ప్లాన్ చేశాడనే ఆరోపణ ఉంది. దోపిడి, కిడ్నాప్ ఆరోపణలపై 3 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. జైల్లో నుంచే జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. భుట్టో రెండోసారి ప్రభుత్వంలో ఆయన పెట్టుబడుల మంత్రిగా ఉన్నాడు. 1996లో భుట్టో ప్రభుత్వం పడిపోయిన తర్వాత జర్దారీ మరోసారి కటకటాల వెనక్కి వెళ్లాడు.

Read Also: Heart attack: ఘోరం.. గుండెపోటుతో సెకండ్ క్లాస్ విద్యార్థి మృతి

భార్యతో వెలుగులోకి:

జర్దారీ 1955 సింధ్ ప్రావిన్స్‌లో భూస్వామ్య ధనిక కుటుంబంలో జన్మించాడు. బెనజీర్ భుట్టోతో 1987లో వివాహం జరిగింది. ఆ తర్వాతే ఆయన రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. అంతకుముందు 1983లో స్థానిక ప్రభుత్వ ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయాడు. జర్దారీ రిచ్ ఫ్యామిలీలో పుట్టడంతో మహిళలతో పార్టీలు, రొమాన్స్ చేసేవాడనే ఆరోపణలు ఉన్నాయి. తన ఇంట్లోనే ఒక ప్రైవేట్ డిస్కో ఉండేది. భుట్టో‌తో వివాహానికి ముందు.. ‘‘పగలు పోలో ఆడే, రాత్రిపూట డిస్కోలకు వచ్చే ప్లేబాయ్’’ అని జర్దారీపై ఉన్న మచ్చను ఖండిస్తూ భుట్టో ఫ్యామిలీ ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది.

బెనజీర్ భుట్టో హత్యతో ప్రెసిడెంట్ పదవి:

బెనజీర్ భుట్టో తండ్రి జుల్ఫీకర్ అలీ భుట్టో నాయకత్వాన్ని కొనసాగించారు. అధికారంలో జుల్ఫీకర్ భుట్టో సైనిక తిరుగుబాటుతో పదవీ కోల్పోయి, అవినీతి ఆరోపణలతో ఆయన ఉరితీయబడ్డారు. ఆ తర్వాత 1988-90 వరకు ఒక ముస్లిం ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహించిన తొలి మహిళగా జెనజీర్ భుట్టో నిలిచారు. ఆ తర్వాత 1993-96 వరకు మరోసారి ప్రధానిగా పనిచేశారు. 2007లో మరోసారి ఎన్నికల్లో పాల్గొనే సమయంలో బాంబు దాడిలో మరణించారు.

2007లో బెనజీర్ హత్య పాకిస్తాన్‌ని కుదిపేసింది. ఉవ్వెత్తున భావోద్వేగాలు ఎగిసిపడ్డాయి. 2008లో పీపీపీ పార్టీ విజయం సాధించింది. ఆ సమయంలోనే జర్దారీ యాక్సిడెంటల్‌గా ప్రెసిడెంట్ అయ్యాడు. 2010లో పాక్ వరదల్లో 1800 మరణించిన సమయంలో ఆయన యూరోపియన్ దేశాలకు సెలవుపై వెల్లడం విమర్శలకు దారి తీసింది. 2011లో ఒసామా బిన్ లాడెన్‌ని అమెరికా దళాలు పాకిస్తాన్‌లోని అబోట్టాబాద్‌లో హతం చేశాయి. ఆ సమయంలో జర్దారీనే ప్రెసిడెంట్‌గా ఉన్నాడు.

Show comments