NTV Telugu Site icon

Rishi Sunak: బ్రిటన్‌తో పాటు ప్రపంచ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పు!

Rishi Sunak

Rishi Sunak

Rishi Sunak: ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడుతూ… తాను బ్రిటన్ ప్రధాని అయితే చైనా పట్ల కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. బ్రిటన్‌తో పాటు ప్రపంచ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పుగా పరణమించిందని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా అమెరికా, భారత్ వంటి దేశాలను చైనా లక్ష్యంగా చేసుకుందని చెప్పడానికి అనేక ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. యూకేకు చైనాను ముప్పుగా అభివర్ణిస్తూనే.. తాను ప్రధాని అయితే బ్రిటన్‌లోని చైనా కన్ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్‌లు అన్నింటినీ మూసివేస్తానని.. చైనీస్ సైబర్-బెదిరింపులను ఎదుర్కోవడానికి కొత్త స్వేచ్ఛా దేశాల కూటమిని నిర్మిస్తానని సునాక్ వాగ్దానం చేశాడు. చైనా సాంకేతిక దూకుడుకు ఎదుర్కొనేందుకు నాటో మాదిరి సరికొత్త మిలటరీ వ్యవస్థను రూపొందించడంతోపాటు డ్రాగన్‌ దేశం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎన్నో ప్రణాళికలు తనదగ్గర ఉన్నాయన్నారు. కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వ రేసులో ఉన్న రిషి సునాక్‌.. తాజాగా జరిగిన ఓ టీవీ డిబేట్‌లో ఈ హామీలు ఇచ్చారు.

బ్రిటన్‌లోని మొత్తం 30 చైనా కన్‌ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్‌లను మూసివేస్తానని.. ఇది ప్రపంచంలోనే అత్యధిక సంఖ్య అన్నారు.కీలకమైన బ్రిటీష్ ఆస్తులను పరిరక్షిస్తానని, వ్యూహాత్మకంగా సున్నితమైన సాంకేతిక సంస్థలతో సహా కీలకమైన బ్రిటిష్ ఆస్తులను చైనా కొనుగోలు చేయడాన్ని నిరోధించాల్సిన అవసరాన్ని పరిశీలిస్తానని కూడా అతను హామీ ఇచ్చాడు. బ్రిటన్‌ సాంకేతికతను చైనా తస్కరిస్తోందని ఆరోపించిన రిషి సునాక్‌.. ఉక్రెయిన్‌పై దాడిలో రష్యాను సమర్థించడం మొదలు తైవాన్‌పై బెదిరింపులు, షిన్‌జియాన్‌, హాంకాంగ్‌లలో మానవహక్కుల అణచివేత వంటి దారుణాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇక సాంస్కృతిక ప్రచార కేంద్రాల పేరుతో బ్రిటన్‌లో చైనా నెలకొల్పిన కన్‌ఫ్యుసియస్‌ ఇన్‌స్టిట్యూట్‌ల కొనసాగింపుతోపాటు బ్రిటన్‌-చైనా భాగస్వామ్యంతో చేపట్టిన పరిశోధన కార్యక్రమాలపై సమీక్ష జరుపుతామన్నారు. చైనా నుంచి పొంచివున్న ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాలతో కలిసి పనిచేస్తానని రిషి సునాక్‌ చెప్పుకొచ్చారు.

Monkeypox: జపాన్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు

కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది ఎంపీలు రిషికి మద్దతుగా నిలిచినప్పటికీ… పార్టీ సభ్యుల్లో మాత్రం ట్రస్‌కే ఎక్కువ ఆదరణ ఉన్నట్లు స్పష్టమవుతోంది. పార్టీలో ఆమెకు మంచి గుర్తింపు ఉండటమే ఇందుకు కారణం. కొద్దిరోజుల్లో మొదలుకానున్న సమ్మర్ క్యాంపెయిన్‌లో… రిషి, ట్రస్ టోరీ సభ్యులను కలిసి తమకు మద్దతు తెలపాలని కోరనున్నారు. ఆ తర్వాత ట్రస్‌కు ఇంకా ఎక్కువ మద్దతు లభిస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. బ్రిటన్‌లోని బెట్టింగ్‌ రాయుళ్లు కూడా ట్రసే తమ ఫేవరెట్ అంటున్నారు. బ్రిటన్ ప్రధానిని ఎన్నుకునేందుకు కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల బ్యాలెట్ ఓటింగ్ ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరగనుంది. లక్షా 60 వేల మందికి పైగా ఈ ఓటింగ్‌లో పాల్గొంటారని అంచనా. మహిళలు, పురుషులతో పాటు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేసే వారిలో మెజార్టీ ఓటర్లు లిజ్‌ ట్రస్‌కే జై కొడుతున్నట్లు స్కై న్యూస్ సర్వే కూడా తెలిపింది. ప్రధాని రేసులో జరిగిన ఐదో రౌండ్లో రిషికి 137 ఓట్లు రాగా… ట్రస్‌కు 113 మాత్రమే వచ్చాయి. కానీ, సభ్యుల మద్దతు విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయేలా ఉందంటున్నాయి.