Site icon NTV Telugu

Iran: హింసాత్మకంగా ఇరాన్.. ప్రభుత్వ ఆస్తులు దహనం

Iran

Iran

ఊహించినట్టుగానే ఇరాన్ మంటల్లో తగలబడుతోంది. గత కొద్దిరోజులగా జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు తాజాగా తీవ్ర రూపం దాల్చాయి. పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు రోడ్లపైకి రావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. గత రాత్రి ఇరాన్ రాజవంశీయుడు రెజా పహ్లవి నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో భారీ ఎత్తున ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు.

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో నిరసనకారులు రణరంగం సృష్టిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టారు. దీంతో మంటల్లో ఆస్తులు దహనం అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే నిరసనకారులను భద్రతా దళాలు అడ్డుకోవడంతో పరిస్థితులు చేదాటిపోతున్నాయి. ఇప్పటి వరకు భద్రతా దళాల కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే ఆందోళనలు తీవ్రతరం కావడంతో అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ నేతృత్వంలోని ఇరాన్ ప్రభుత్వం దేశానికి ఇంటర్నెట్, అంతర్జాతీయ టెలిఫోన్ కాల్స్‌ను నిలిపివేసింది. అంతేకాకుండా నిరసనకారులను చర్చలకు పిలిచేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు ఇరాన్ నుంచి పారిపోయిన క్రౌన్ ప్రిన్స్ రజా పహ్లావి పిలుపు మేరకు నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. ‘‘నియంతకు మరణం!’’, ‘‘ఇస్లామిక్ రిపబ్లిక్‌కు మరణం!’’ అనే నినాదాలతో మార్మోగుతోంది. ‘‘ఇది చివరి యుద్ధం! పహ్లవీ తిరిగి వస్తాడు!.’’ అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే ఇంటర్నెట్ బంద్ అయ్యేలోపే ఇరానీయులు వీధుల్లోకి వచ్చేశారు. ప్రస్తుతం ఇరాన్ అంతటా.. నగరాలు, గ్రామీణ, పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు చెలరేగాయి. నిరసనకారులకు మద్దతుగా మార్కెట్లు, బజార్లు మూసివేశారు.. ఇప్పటివరకు జరిగిన హింసలో కనీసం 42 మంది మరణించగా.. 2,270 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారని అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఇదిలా ఉంటే నిరసనకారులపై కాల్పులకు తెగబడితే ఖబడ్దార్ అంటూ ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. నిరసనల్లో ప్రజల ప్రాణాలు తీస్తే అమెరికా మౌనంగా ఉండదని, అలాంటి పరిస్థితి వస్తే ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

అసలు ఏం జరుగుతోంది?
ఇరాన్‌లో కరెన్సీ విలువ పడిపోతుండటంతో గత రెండు వారాలుగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం కొనసాగుతోంది. ఇప్పటికే జరుగుతున్న నిరసనలు గురువారం రాత్రి మరింత ఉధృతంగా మారాయి. అమెరికాలో నివసిస్తున్న క్రౌన్ ప్రిన్స్ రేజా పహ్లవి, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఇస్లామిక్ రిపబ్లిక్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునివ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. ఆయన పిలుపు తర్వాత భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేపట్టారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన ఇరాన్ ప్రభుత్వం భద్రతా బలగాలను రంగంలోకి దింపి రోడ్లు ఖాళీ చేయించే ప్రయత్నం ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలోని కనీసం 50 నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపేసింది. టెలిఫోన్ లైన్లను సైతం కట్ చేసింది. అయినా ప్రజలు వెనక్కి తగ్గకుండా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో రోడ్లపైకి వస్తున్నారు.

చరిత్ర..
1979 వరకు ఇరాన్‌లో రాజవంశ పరిపాలన ఉండేది. అనంతరం ఇస్లామిక్ విప్లవం వచ్చింది. ఈ ఉద్యమం రగిలినప్పుడు చివరి రాజవంశీయుడు షా మొహమ్మద్ రెజా పహ్లవి పారిపోయాడు. ఇతడు 1980లో ఈజిప్టులో మరణించాడు. ఇతని కుమారుడు రెజా పహ్లవి.. వాస్తవానికి రాజవంశీయుడిగా ఇతడు వారసుడు. ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇతడు యునైటెడ్ స్టేట్స్‌లో నివాసం ఉంటున్నాడు.

తాజాగా ఖమేనీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పిలుపునిచ్చాడు. దాదాపు రాజవంశం పోయి 46 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఇస్లామిక్ విప్లవానికి ముందు ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్‌తో మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత టెహ్రాన్.. అమెరికా, ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువుగా మారింది. అయతుల్లా ఖమేనీ సుప్రీం నాయకుడిగా ఇస్లామిక్ రిపబ్లిక్ స్థాపించారు. అప్పటినుంచి ఆయన పాలనే కొనసాగుతోంది. ఆనాటి నుంచి అమెరికాతో శత్రుత్వం పెరిగింది.

 

Exit mobile version