Site icon NTV Telugu

Trump rally: ట్రంప్ సభలో మరో అలజడి.. వేదికపైకి వెళ్లేందుకు యత్నం.. అరెస్ట్

Trumprally

Trumprally

అమెరికాలో మరోసారి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార ర్యాలీలో తీవ్ర అలజడి చెలరేగింది. ట్రంప్ సభావేదికపైకి మాట్లాడుతుండగా ఓ అగంతకుడు పైకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో సభలో తీవ్ర కలకలం రేగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Pakistan: పాక్‌కి సాయం చేయొద్దని చెప్పినా పెంటగాన్ వినలేదు.. ట్రంప్ ఆదేశాలు బేఖాతరు..

శుక్రవారం పెన్సిల్వేనియాలోని జాన్‌స్‌టౌన్‌లో ట్రంప్ ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ప్రచార ర్యాలీలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతుండగా ఓ వ్యక్తి వేదికపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి మీడియా ఏరియాలోకి ప్రవేశించాడు. వెంటనే పోలీసులు అతడిని చుట్టుముట్టారు. టేజర్‌తో లొంగదీసుకున్నారు. ఆ తర్వాత వెంటనే ప్రచార ర్యాలీ నుంచి బయటకు తీసుకెళ్లిపోయారు. ఇతడు ట్రంప్ మద్దతుదారుడా? లేదంటే ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Champions Trophy 2025: భద్రత విషయంలో ఆందోళన ఉంది.. టీమిండియా క్రికెటర్లు పాకిస్తాన్ వెళ్లొద్దు

ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. తృటిలో ట్రంప్‌కు ప్రాణాపాయం తప్పింది. ప్రచారంలో ఉండగా అగంతకుడు తుపాకీతో కాల్చాడు. బుల్లెట్ చెవిని తాకి వెళ్లిపోయింది. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేది. తాజాగా శుక్రవారం అదే తరహాలో దుండగుడు దూసుకురావడంతో పోలీసుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. పోలీసులు నిందితుడ్ని విచారిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది చివరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష బరిలో తొలుత ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ప్రత్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ నిలబడ్డారు. అయితే వయసు రీత్యా బైడెన్ ఆరోగ్యం దెబ్బ తినడంతో ఆయన స్థానంలో కమలా హారిస్ బరిలోకి వచ్చారు. ప్రస్తుతం ట్రంప్, కమలా హారిస్ బరిలో ఉన్నారు. ప్రచారంలో ఇద్దరూ దూసుకుపోతున్నారు.

Exit mobile version