Islamabad High Court: చేతులు కాలాకా.. ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది ఇస్లామాబాద్ హైకోర్టు చెప్పే విషయం. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు విధించిన శిక్షలో పొరపాటు జరిగిందని ఇప్పుడు ప్రకటించింది. ఆయనకు జైలు విధించడం జరిగింది.. ఆయన జైలుకు వెళ్లి ఇప్పటికే 20 రోజులు దాటిపోయింది. ఇప్పుడు ఇస్లామాబాద్ హైకోర్టు ఇమ్రాన్‌ఖాన్‌కు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి శిక్ష విధించడంలో పొరపాటు చోటు చేసుకుందని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కేసు శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టులో విచారణ జరగగా.. విచారణకు పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది కోర్టుకు హాజరు కాకపోవడంతో సోమవారానికి వాయిదా వేశారు.
Read Also: Dharmana Prasada Rao : నేను ఎవరో జడిపిస్తే జడిసే రకం కాదు..
తోషాఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు జైలు శిక్ష విధించడంలో పొరపాటు చోటుచేసుకుందని ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం పేర్కొంది. అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించడంలో పొరపాటు చోటుచేసుకుందని తెలిపింది. తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్‌కు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించారు. దీంతో ఆయన ప్రస్తుతం అటోక్ జైలులో ఉన్నారు. శిక్ష ఖరారు కావడంతో పాక్ ఎన్నికల సంఘం ఇమ్రాన్‌ను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడని ప్రకటించి క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఆయన్ను అయిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడని ప్రకటించింది. ఇమ్రాన్‌కు సెషన్స్ కోర్టు శిక్ష విధించడంలో పొరపాటు చోటుచేసుకుందని బుధవారం సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. అయితే జైలు శిక్ష సస్పెన్షన్ కోసం ఇమ్రాన్ ఖాన్ పెట్టుకున్న పిటిషన్‌పై ఇస్లామాబాద్ హైకోర్టు నిర్ణయం వెలువడేంత వరకు వేచిచూస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ హైకోర్టులో కేసు శుక్రవారం విచారణ చేపట్టారు. అయితే శుక్రవారం విచారణ సమయంలో పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది విచారణకు హాజరు కాకపోవడంతో కేసును సోమవారానికి వాయిదా వేసింది. పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ తరపున కోర్టుకు హాజరైన న్యాయవాది ఇందుకు అభ్యంతరం తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు ఇప్పటికే 20 రోజుల నుంచి జైలులో ఉన్నారని, మరో మూడు రోజులు జైలులోనే ఉంచుతారా అని ప్రశ్నించారు. ఇమ్రాన్‌కు విధించిన శిక్షను వెంటనే సస్పెండ్ చేయాలని కోర్టును కోరారు. సోమవారం తాము కోర్టుకు హాజరుకాబోమనీ, కావాలంటే ఇమ్రాన్‌ను మళ్లీ జైలుకు పంపండని వ్యాఖ్యానించారు.