Israel: ఇటీవల దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తు్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కో-పైలట్ కూల్చాలాని ప్రయత్నించాడు. భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసి విమానాన్ని తన అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించాడు. స్మిత్ పోరాటంతో విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఇదిలా ఉంటే, ఈ ఘటన తర్వాత ఇజ్రాయిల్ కఠిన చర్యలు తీసుకుంటోంది. తమ దేశానికి వచ్చే విమానాల్లో, తమ దేశంతో దౌత్య సంబంధాలు లేని పైలట్లు, సిబ్బంది లేకుండా చూడాలని ప్రపంచ ఎయిర్‌లైన్ సంస్థల్ని కోరింది.
ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలు నడిపే విషయంలో పాకిస్తానీ పైలట్లు, క్యాబిన్ సిబ్బంది లేకుండా ఎయిర్ ఫ్రాన్స్ ఆంక్షలు విధించింది. పాకిస్తాన్‌తో పాటు ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలు లేని దేశాల సిబ్బందిని ఇకపై ఇజ్రాయిల్‌కు వెళ్లే ఫ్లైట్లలో అనుమతించరు. ఎయిర్ ఫ్రాన్స్‌తో పాటు మరిన్ని విమానయాన సంస్థలు ఇదే తరహాలో చర్యలు తీసుకుంటున్నాయి. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన స్మార్ట్వింగ్స్ కూడా ఇజ్రాయిల్ నిబంధనల్ని పాటిస్తామని తెలిపింది.
పాకిస్థాన్, ఇరాన్, ఒమన్, ఇరాక్, లెబనాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, మలేషియా, మాల్దీవులు వంటి 31 దేశాలు ఇజ్రాయిల్ ఆంక్షల జాబితాలో ఉన్నాయి. అయితే, ద్వంద్వ పౌరసత్వం ఉన్న సిబ్బందికి కూడా ఈ నిషేధం వర్తించే అవకాశం ఉంది. అంటే పాకిస్తానీ పౌరసత్వంతో పాటు వేరే దేశానికి చెందిన పౌరసత్వం ఉన్నవారికి కూడా ఈ నిబంధనలు వర్తించవచ్చు.
ఇదిలా ఉంటే, ఇటీవల ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టెల్ అవీవ్ వస్తున్న సమయంలో, అందులోని పైలట్ ఇండోనేషియాకు చెందిన వ్యక్తి అని తెలిసి, ఇజ్రాయిల్ అధికారులు మార్గం మధ్యలోనే విమానాన్ని వెనక్కి తిప్పిపంపించారు. మళ్లీ ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు వెళ్లి, పైలట్ మారిన తర్వాత ఇజ్రాయిల్‌కు ప్రయాణమైంది.

