Ayman Al Zawahiri: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఆదివారం అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో అల్ ఖైదా చీఫ్ అయమన్ అల్ జవహరి హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా ధ్రువీకరించింది. అమెరికాలో 11 సెప్టెంబరు 2001లో ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడికి ప్రతీకారంగా అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామాబిన్ లాడెన్‌ను హతమార్చిన అమెరికా.. ఆ దాడికి సాయం చేసిన ప్రస్తుత చీఫ్ జవహరిని తాజాగా అంతం చేసింది. ఆఫ్ఘన్ గడ్డను అమెరికా దళాలు వదిలి వెళ్లిన 11 నెలల తర్వాత జవహరిని హతమార్చడం గమనార్హం. ట్విన్ టవర్స్‌పై దాడి తర్వాత 21 సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న జవహరిని హతమార్చడం ద్వారా అమెరికా బలగాలు ఘన విజయం సాధించినట్టు అయింది.
15 ఏళ్లకే అరెస్ట్: నిజానికి అమెరికన్లు అయ్‌మన్ అల్ జవహరిని మర్చిపోలేరు. ప్రపంచానికి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ పక్కన ఎప్పుడూ కళ్లజోడు పెట్టుకుని ఫొటోల్లో కన్పించే అతడి ముఖం మాత్రం చాలా మందికి పరిచితమే. అగ్రరాజ్యం అమెరికాపై లాడెన్ జరిపిన భీకర దాడి వెనుక ఉన్నది అతడే.. లాడెన్ మరణం తర్వాత అల్‌ఖైదా ఉనికి కోల్పోకుండా కాపాడిందీ అతడే. ఈజిప్టు రాజధాని కైరోలో 19 జూన్ 1951లో అల్ జవహరి జన్మించారు. డాక్టర్లు, స్కాలర్లు ఉన్న మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. తాత రబియా అల్ జవహరి .. సున్నీ ఇస్లామిక్ వర్సిటీలో ఇమామ్‌గా చేశారు. స్కూల్ దశలో ఇస్లామిక్ రాజకీయవేత్తగా మారారు. ముస్లిం బ్రదర్‌వుడ్‌లో సభ్యత్వం తీసుకోవడం వల్ల 15 ఏళ్లకే అరెస్టు అయ్యాడు. కైరో మెడికల్ స్కూల్ వర్సిటీలో మెడిసన్ చదివాడు. 1974లో గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత నాలుగేళ్లకు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రి మొహమ్మద్ ఫార్మకాలజీ ప్రొఫెసర్. తీవ్రవాద భావజాలం ఉండడంతో ఎక్కువకాలం వైద్యుడిగా కొనసాగలేకపోయాడు.
ఆయనో కంటి వైద్యుడు: బాల్యం నుంచే మతంపై ఆసక్తి పెంచుకున్న అల్ జవహరి.. మతపరమైన అంశాలను గమనించేవాడు. కంటి వైద్యుడైన అల్ జవహరి మధ్య ఆసియా, మధ్యప్రాచ్యం మొత్తం తిరిగాడు. సోవియట్ యూనియన్ ఆక్రమణకు వ్యతిరేకంగా జరిగిన ఆప్ఘనిస్థాన్ యుద్ధాన్ని కళ్లారా చూశాడు. ఆ సమయంలోనే యువకుడైన ఒసామా బిన్ లాడెన్‌ను, సోవియట్ బలగాలను ఆఫ్ఘన్ నుంచి వెళ్లగొట్టేందుకు సాయపడుతున్న అరబ్ తీవ్రవాద గ్రూపులను కలిశాడు. 1973లో ఈజిప్టియన్ ఇస్లామిక్ జిహాద్ తీవ్రవాద ముఠా ఏర్పడగా.. జవహరీ అందులో చేరాడు. 1981లో అప్పటి ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సదత్ కైరోలోని ఓ మిలిటరీ పరేడ్‌లో పాల్గొనగా కొంతమంది ముష్కరులు సైనికుల దుస్తుల్లో వచ్చి అతడిని హత్య చేశారు. ఈ ఘటన తర్వాత ఈజిప్టు పోలీసులు దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టి వందలాది మంది అనుమానితులు, ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అందులో జవహరీ కూడా ఉన్నాడు. అయితే ఈ హత్య కుట్ర అభియోగాల నుంచి జవహరీ నిర్దోషిగా తేలినా.. ఆయుధాలను అక్రమంగా ఉపయోగిస్తున్నందుకు గానూ మూడేళ్లు జైలు శిక్ష పడింది. అయితే జైల్లో ఉన్న సమయంలో పోలీసులు అతడిని తీవ్రంగా కొట్టారట. ఆ పరిణామాలు అతడిలో తీవ్రవాద భావజాలాన్ని మరింత పెంచాయని, అతడు మరింత క్రూరంగా మారేందుకు కారణమయ్యాయని తోటి ఖైదీలు చెబుతారు.
Ayman Al-Zawahiri Kill Plan: అతనొక్కడే టార్గెట్.. తెరవెనుక ప్లాన్ ఇది!
ఎంతో మందిని పొట్టనబెట్టుకున్నాడు: 1985లో జైలు నుంచి రిలీజైన జవహరి ఆ తర్వాత సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. అక్కడే బిన్ లాడెన్‌తో అతడికి స్నేహం కుదిరింది. ఆ తర్వాత పాకిస్థాన్ చేరుకున్నాడు. మళ్లీ అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఒసామా బిన్ లాడెన్ అల్‌ఖైదా పేరుతో ఉగ్రముఠాను ప్రారంభించగా.. ఆ సమయంలో జవహరీ అతడి పక్కనే ఉన్నట్లు గతంలో వార్తా కథనాలు వచ్చాయి. ఇతడిని బిన్ లాడెన్‌కు కుడిభుజంగా చెబుతుంటారు. 1993లో ఈజిప్టులో ఇస్లామిక్ జిహాదీ గ్రూప్ మళ్లీ వెలుగులోకి వచ్చి జవహరీ దానికి నాయకత్వం వహించాడు. ఈజిప్టు ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా జవహరీ సారథ్యంలో ముఠా దేశవ్యాప్తంగా వరుస ఉగ్రదాడులు జరిపింది. ఈ దాడుల్లో 1200 మందికి పైగా సామాన్య పౌరులు మరణించారు. 1990 దశకంలో జవహరి ప్రపంచ టూర్ చేసినట్లు భావిస్తున్నారు. ఆశ్రయం, నిధుల కోసం అతను తిరిగినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి సోవియట్ వైదొలిగిన సమయంలో అతను అనేక దేశాలకు వెళ్లాడు. 1996లో సరైన వీసా లేని కేసులో చెచాన్యాలో అతన్ని రష్యా అరెస్టు చేసింది. 1997లో ఆఫ్ఘన్‌లోని జలాలాబాద్‌కు వెళ్లాడు. అక్కడే ఒసామా బిన్ లాడెన్‌తో బేస్ ఏర్పర్చుకున్నాడు. ఆ మరుసటి ఏడాది వీరిద్దరు, ఇతర ఇస్లామిస్ట్ ముఠాలతో కలిసి వరల్డ్ ఇస్లామిక్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫ్రంట్ ఆధ్వర్యంలో కెన్యా, టాంజానియాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై భీకర దాడులు జరిపి 228 మందిని పొట్టనబెట్టుకున్నారు.
Ayman al-Zawahiri: అల్‌ఖైదా చీఫ్ హతం.. ధృవీకరించిన అమెరికా అధికారి
అల్ ఖైదా వారసుడెవరో?: అల్ ఖైదా బాధ్యతలను సీనియారిటీ లిస్ట్‌లో ఉన్న సైఫ్ అల్ ఆదెల్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సైఫ్ అల్ ఆదెల్ పాటు అబ్దుల్ రెహమాన్ అల్ మఘ్రెబీ, యాజిద్ మెబారక్ కూడా ఈ సీనియారిటీ లిస్ట్‌లో ఉన్నారు. అల్ షాబాద్‌కు చెందిన అహ్మద్ దిరియె కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది. భారత్‌లో అల్ ఖైదాకు చెందిన 400 మంది ఉన్నట్లు సమాచారం. వీరికి చెందిన వారు భారత్‌తో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, మయన్మార్‌ల్లో కూడా ఉన్నారని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నివేదిక ఒకటి వెల్లడించింది. నిజానికి చాలాకాలంగా అల్‌ఖైదా అంత క్రియాశీలకంగా ఏమీ లేదు. ప్రపంచ దేశాలు కూడా ప్రస్తుతానికి అల్ ఖైదాను అంత ముప్పుగా ఏమీ పరిగణించడం లేదు. అదీకాక, ఇతర దేశాల్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడి అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వానికి అంతర్జాతీయంగా ఇబ్బందికర పరిస్థితులను అల్ ఖైదా కల్పించాలనుకోవడం లేదు. ప్రస్తుతం తాలిబన్లకు అల్ ఖైదా అగ్ర నాయకత్వం సలహాదారు పాత్ర పోషిస్తోందని సమాచారం.