ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో తెలియదు… ఎక్కడ ఏ ఆత్మాహుతి దాడికి తెగబడతారో తెలియదు..
దేశమంతా హైటెన్షన్….. భయం గుప్పిట్లో ఆఫ్గన్ ప్రజలు
మరి కొన్ని గంటల్లో ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా దళాలు పూర్తిగా వైదొలగాలి. ఆగస్టు 31 నాటికి ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా దాని మిత్రదేశాలకు చెందిన సైనికులంతా వెళ్లిపోవాలి. ఇది అమెరికా-తాలిబాన్ల మధ్య డీల్. సో డెడ్‌లైన్ దగ్గరవుతోంది. ఇంకో 24 గంటలే ఉంది. అమెరికా తరలింపు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది.
ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా శాశ్వత నిష్క్రమణ నేపథ్యంలో ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు దాడులను ఉధృతం చేసే ప్రమాదం ఉంది. రాబోవు 24- 36 గంటలు అత్యంత కీలకమని ప్రెసిడెంట్ జో బైడన్ కూడా హెచ్చరించాడు. మరొక్క ప్రాణం కూడా పోకూడదు..ప్రతి సైనికుడిని రక్షించే బాధ్యత తమ మీద ఉందని ఆయన అన్నారు. ISIS -K ఉగ్ర సంస్థపై జరిపిన ద్రోన్ దాడి చివరిది కాదన్నారాయన.
కాబూల్ విమానాశ్రయం సమీపంలో దాడులు జరిగే అవకాశాలున్నందున..ఆ దరిదాపులకు ఎవరూ రావద్దని..తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అమెరికా విదేశాంగశాఖ సూచించింది. మరోవైపు, ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ విమానాశ్రయంపై దాడులు కొనసాగుతున్నాయి. క్షణం క్షణం పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఆఫ్గనిస్తాన్‌లో ఉన్న మూడు వందలమంది పౌరులను గడువులోగా తరలిస్తామని అమెరికా పేర్కొంది.
కాబుల్ విమానాశ్రయం ఆదివారం భారీ పేలుడు జరిగింది. పేలుడు ప్రభావంతో అక్కడి భవన సముదాయంలో దట్టమైన నల్లని పొగలు వ్యాపించాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడయాలో షేర్ అవుతున్నాయి. ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వం కూడా ఈ ఘటనను దృవీకరించింది. ఇదిలావుంటే, ఇస్లామిక్ స్టేట్ – ఖోరాసన్ ఐఎస్-కే గ్రూప్ సూసైడ్ బాంబర్ లక్ష్యంగా తాము క్షిపణి దాడి చేశామని అమెరికా అధికారులు తెలిపారు. కాబుల్ ఏర్‌పోర్ట్ పై ఎటాక్ చేసేందుకు మాటు వేసిన సూసైడ్ బాంబర్ ఉన్న వాహనంపై డ్రోన్ దాడి జరిపామని వారు వెల్లడించారు. సాధారణ పౌరులెవరూ ఈ దాడిలో మరణించినట్లు సమాచారం లేదు. మరోవైపు కాబుల్ విమానాశ్రయం సమీపంలో రాకెట్ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.. అయితే, అమెరికా చెబుతున్న క్షిపణి దాడి, ఈ రాకెట్ దాడి ఒకటేనా అన్నదానిపై స్పష్టత లేదు.
ఒప్పందం ప్రకారం అమెరికా పౌరలను సురక్షితంగా దేశం విడిచి వెళ్లేందుకు తాలాబాన్లు సహకరిస్తున్నారు. కానీ ముప్పు ఐసిస్-కెతో పొంచి వుంది. ఇదే అందరినీ ఆందోలనకు గురిచేస్తోంది. వారు ఎంతకైనా తెగించే మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్స్. అఫ్గాన్‌లోని జిహాదీ మిలిటెంట్ గ్రూపులన్నిటి కంటే అత్యంత హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతుందని దానికి పేరు. తాలిబాన్లు..ఐసిస్-కె తీవ్రవాద గ్రూపుల మధ్య గత కొన్నేళ్లుగా విభేదాలు నెలకొన్నాయి. ఇప్పుడు తాలిబాన్లు, ఆమెరికా ఇద్దరూ దానికి శతృవులే.. అందుకే ఎలాగైనా తామేంటో ప్రపంచానికి చూపించాలని ఇస్లామిక్ స్టేట్ దాడులకు తెగబడుతోంది. అందుకు కాబూల్ ఎయిర్‌పోర్ట్ టార్గెట్ చేశారు.
ఇస్లామిక్ స్టేట్ నుంచి ముప్పు పొంచివున్న నేపథ్యంలో కాబూల్ ఏర్ పోర్ట్ పరిసరాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయం చుట్టూ తాలిబాన్లు మరిన్ని చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ఎక్కువ మంది అఫ్గాన్ పౌరులను లోపలికి అనుమతించడం లేదు. తరలింపు ప్రక్రియ రెండు వారాల క్రితం మొదలైంది. దేశం విడిచి వెళుతున్న వారిలో ఆఫ్గన్ పౌరులతోపాటూ విదేశీయులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రక్రియ ఆఖరు అంకానికి చేరింది. దాంతో వారికి క్షణమొక యుగంలా గడుస్తోంది ఇప్పుడు. అంతటా హైటెన్షన్ నెలకొంది.