NTV Telugu Site icon

Afghanistan: మహిళా న్యూస్ యాంకర్లు కూడా ఆ పని చేయాల్సిందే..

Afghanistan Taliban Leaders

Afghanistan Taliban Leaders

ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు తాలిబన్ రాజ్యం నడుస్తోంది. వాళ్లు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అక్కడ. మహిళలకు పెద్దగా హక్కులేం ఉండవు తాలిబన్ పాలనలో. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు తాలిబన్ పాలకులు. ఇప్పటికే మహిళలపై పలు రకాలుగా ఆంక్షలు విధిస్తున్నారు. మహిళలను కేవలం వంటిళ్లకే పరిమితం చేశారు. బయటకు వస్తే ఖచ్చితంగా బుర్ఖా ధరించాలని హుకుం జారీ చేశారు. దీంతో పాటు భర్త, అన్న ఎవరైనా తోడు ఉంటేనే బయటకు రావాలనే ఆంక్షలను విధించారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మహిళా జర్నలిస్టులపై కూడా ఆంక్షలు విధించింది తాలిబన్ సర్కార్. న్యూస్  చదువుతున్న మహిళా యాంకర్లు తప్పకుండా తమ మొహాలను కప్పుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఆప్ఘన్ సర్కార్. ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రతీ మీడియా సంస్థ కూడా ఈ నిబంధనలను తప్పకుండా పాటించాలని హుకుం జారీ చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల ఐక్యరాజ్యసమితి శరణార్థి సహయ కార్యక్రమాల్లో పని చేసే మహిళలు కూడా తప్పకుండా బుర్ఖా ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంపై మహిళల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  ఈ విషయంపై తాలిబన్ అధికార ప్రతినిధి అకిఫ్ మజహర్ స్పందించారు. న్యూస్ చదువుతున్న సమయంలో మహిళ యాంకర్లు మొహాన్ని కప్పుకోవాలనే ప్రతిపాదనకు మీడియా ప్రతినిధులందరూ అంగీకరిచారని వెల్లడించారు. మే 21 వరకు అందరికి వెసులుబాటు ఉంటుందని…  ఆ తరువాత తప్పకుండా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేసింది తాలిబన్ సర్కార్.

2021 ఆగస్టు 15న ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి  తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి ఆఫ్ఘన్ పరిస్థితి దారుణంగా తయారైంది. తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ప్రజలు ఆకలి కష్టాలు తీర్చుకోవడానికి కిడ్నీలను కూడా అమ్ముకుంటున్నారు. కానీ తాలిబన్ ప్రభుత్వం ఇవేవి పట్టనట్లు వ్యవహరిస్తోంది. తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వరసగా దాడులు చేస్తున్నారు. ఆప్ఘన్ కు ఎక్కువగా నిధులు పాశ్చాత్య దేశాల నుంచే వస్తుంటుంది. అయితే తాలిబన్ అధికారం చేపట్టిన తరువాత విదేశీ సాయం దాదాపుగా నిలిచిపోయింది.