Kim Jong Un: నార్త్ కొరియా గురించి పెద్దగా ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అడపాదడపా వివరాలు తప్పితే పెద్దగా అక్కడి సమచారం బయటకు రాదు. ఇక అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పటికే నార్త్ కొరియా ప్రజలకు వేరే ప్రపంచం ఉందనే విషయం కూడా తెలియదు. తమకు తెలిసినంత వరకు కిమ్ కుటుంబమే దేవుళ్లు, కిమ్ చెప్పిందే నిజం. అంతలా ఆ దేశం నిర్బంధానికి గురవుతోంది.
అయితే ఇలాంటి దేశంలో చివరకు ప్రజలు ప్రశాంతంగా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వీల్లేదని కిమ్ ఆదేశాలు జారీ చేశారు. దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యలపై కిమ్ అక్కడి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఏకంగా అక్కడ 40 శాతం ఆత్మహత్యలు పెరిగాయి. ఈ ఆత్మహత్యలను సోషలిజానికి వ్యతిరేకంగా చేసే రాజద్రోహంగా కిమ్ అభివర్ణించారు. ప్రజల ఆత్మహత్యలకు అధికారులు బాధ్యత వహించాలని ఆదేశించారు. ఇకపై ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటే అధికారులదే బాధ్యత అన్నమాట.
Read Also: India Tour: ఇండియాలో పాకిస్థానీ వ్లాగర్ బైక్ టూర్.. !
ఈ విషయాన్ని రేడియో ఫ్రీ ఆసియా సంస్థ తెలియజేసింది. నార్త్ కొరియా ఈశాన్య ప్రాంతం హామ్ యాంగ్ ప్రాంతానికి చెందిన ఒక అధికారి, కిమ్ అన్ని ప్రావిన్సుల్లోని అధికారులకు ఇలాంటి ఆదేశాలు జారీ చేసినట్లు రేడియో ఫ్రీ ఆసియాకు తెలియజేశాడు. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన వారి వివరాలు కూడా వెల్లడిస్తున్నారని పేర్కొన్నారు. నార్త్ కొరియాలోని మరో ప్రావిన్స్ ర్యాంగ్యాంగ్ లో ఆకలి చావుల కన్నా ఆత్మహత్యలతోనే ఎక్కువ మంది మరణిస్తున్నారు. అయితే కిమ్ ఆదేశాలు జారీ చేశారు కానీ వీటిని ఎలా అడ్డుకోవాలో తెలియక అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఉత్తర కొరియాలో పేదరికం, ఆకలి కారణంగా ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ప్రపంచంలో వేరే దేశంతో సంబంధాలు లేకుండా కిమ్ తన పాలనను కొనసాగిస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా అమెరికాను బూచిగా చూపి అక్కడి ప్రజల్లో వ్యతిరేకతను నూరిపోస్తున్నాడు. క్షిపణులు, ఆయుధాలకు ఖర్చు పెడుతుంది తప్పితే ప్రజల సంక్షేమాన్ని ఆలోచించడం లేదు అక్కడి ప్రభుత్వం. చిత్ర విచిత్రమైన రూల్స్, కఠినమైన శిక్షలు ప్రజలను మానసిక వేధనకు గురిచేస్తున్నాయి.