NTV Telugu Site icon

Vivek Ramaswamy: “ట్రంప్‌ని దేవుడే రక్షించాడు”..భారతీయ అమెరికన్ వ్యాఖ్యలు..

Vivekgramaswamy

Vivekgramaswamy

Vivek Ramaswamy: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఎన్నికల్లో పోటీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం యావత్ ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. పెన్సిల్వేనియాని బట్లర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌ అనే నిందితుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవి పక్క నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా, ఒకరు మరణించారు. నిందితుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కాల్చి చంపారు. ఈ ఘటనపై ప్రధాని మోడీతో పాటు ఇతర ప్రపంచ దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కాంక్షించారు.

Read Also: Elon Musk: “నాపై రెండుసార్లు హత్యాయత్నం”.. ట్రంప్‌ హత్యాయత్నం నేపథ్యంలో మస్క్ సంచలన ఆరోపణలు..

ఇదిలా ఉంటే, రిపబ్లికన్ పర్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడిన భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి ట్రంప్ హత్యాయత్నంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ట్రంప్ సురక్షితంగా ఉన్నారనే వార్త దేవుడి చర్య కన్నా తక్కువేం కాదు’’అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దేవుడు ట్రంప్‌ని రక్షించమే కాదు, మన దేశం కోసం జోక్యం చేసుకున్నాడని తన హృదయం చెబుతోందని పోస్టులో పేర్కొన్నారు. ‘‘ఈ రోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భవిష్యత్తు, మనుగడ కేవలం బుల్లెట్ మార్గంలో వెంట్రుకవాసిలో తప్పిపోయింది’’ అని ఆయన అన్నారు.

ట్రంప్‌పై ప్రశంసలు కొనసాగిస్తూనే, అమెరికన్లు తమ తదుపరి అధ్యక్షుడి రియల్ క్యారెక్టర్ చూసే అవకాశం ఉందని అన్నారు. ‘‘ అతను కాల్పులకు గురయ్యాడు. రక్తాన్ని చిందించాడు. ఆపై అతను తన మద్దతుదారుల కోసం తిరిగి నిలబడ్డాడు’’ అని రామస్వామి అన్నారు. ఈ ఘటనపై రామస్వామి అధ్యక్షుడు జో బైడెన్‌ని టార్గెట్ చేస్తూ ఆరోపించారు. ‘‘ మొదట వారు ట్రంప్‌ని కేసులో ఇరికించారు. విచారించారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రయత్నించారు. ఇప్పుడు ఈ విషాదఘటన జరగడం తమకు షాకింగ్ కాదు’’ అని అన్నారు. ఈ రోజు జరిగిన సంఘటనను బైడెన్ ఖండించడం సరిపోదని, ఈ రోజు ఈ విషాదానికి దారితీసిన విషపూరిత వాతావరణాన్ని మార్చలేరని దుయ్యబట్టారు.