Site icon NTV Telugu

Guinness World Record: మహిళకు గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు.. ఎందులోనో తెలిస్తే షాక్‌

Guinness World Record

Guinness World Record

Guinness World Record: ఎవరి పిచ్చి వారికానందం. అటువంటిదే ఈ గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్. అమెరికాకు చెందిన ఓ మహిళ అతి బిగ్గరగా త్రేన్పు రప్పించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. అందుకోసం ఆమె కొన్ని వారాలపాటు సాధన చేసింది. చాలా మందికి ఆహారం ఆరగించిన తరువాత త్రేన్పులు వస్తుంటాయి. అలా వచ్చే త్రేన్పుల శబ్దాన్ని రెట్టింపు చేయడం ఎలాగో ఓ మహిళ సాధన చేసింది. ఆ ప్రత్యేకతతో తాజాగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మేరీలాండ్‌కు చెందిన కింబర్లీ కిమీకోలా వింటర్‌ 107.3 డెసిబెల్స్‌ శబ్దంతో త్రేన్పు రప్పించి ‘అతి బిగ్గరైన త్రేన్పు’ రికార్డు తన సొంతం చేసుకుంది. అంతకు ముందు ఈ రికార్డు ఇటలీకి చెందిన ఎలిసా కాగ్నోని పేరిట ఉండేది. ఆమె 107 డెసిబెల్స్‌ శబ్దంతో త్రేన్పు రప్పించింది. పురుషుల్లో ఇలాంటి రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన నెవిల్లే షార్ప్‌ పేరిట ఉంది. అతడు 112.7 డెసిబెల్స్‌ శబ్దంతో త్రేన్పు రప్పించాడట.

Read also: High Courts: హైకోర్టుల పేర్ల మార్పు ప్రతిపాదన లేదు: కేంద్రం

ఇంతకీ తాజాగా రికార్డు నెలకొల్పిన మహిళ త్రేన్పుతో ఎంత శబ్దం చేసిందో మీరు ఊహించగలరా? కిచెన్‌లో వినియోగించే బ్లెండర్‌ 70 నుంచి 80 డెసిబెల్స్‌ శబ్దం చేస్తుంది. హ్యాండిల్‌ డ్రిల్ మిషన్‌ (90-95), కొన్ని ద్విచక్ర వాహనాలు (100-110) డెసిబెల్స్‌ శబ్దాలు చేస్తాయి. కిమీకోలా వాటిని మించిపోయింది. ఆమె తాజా త్రేన్పును ఐ హార్ట్‌ రేడియో స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రత్యక్షంగా అందరికీ వినిపించారు. త్రేన్పు బిగ్గరగా రావడానికి ముందు ఆమె బ్రేక్‌ ఫాస్ట్ చేసింది, కాఫీ, బీర్‌ తాగింది. ఏ ఆహారం తీసుకుని, ఏయే పానీయాలు తాగితే త్రేన్పు పెద్దగా వస్తుందో తెలుసుకోవడానికి ఆరు వారాలపాటు సాధన చేసింది. స్పైసీ ఫుడ్స్‌, సోడా, ఆల్కహాల్‌తో ఉపయోగం ఉంటుందని తెలుసుకుంది. నీళ్లు తాగి కూడా త్రేన్పు తెప్పించగల నేర్పు తాను సాధించింది.

Read also:Dowry Harassment: వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

కిమీకోలా వైవిధ్యమైన శైలి నచ్చి చాలా మంది ఆమెకు అభిమానులుగా మారారు. రకరకాల త్రేన్పులు చేసి చూపించమని ఆమెను సామాజిక మాధ్యమాల్లో వారు అభ్యర్థిస్తుంటారు. నోరు మూసుకొని త్రేన్పు రప్పించమని ఒకరు కోరితే.. రాక్షసుడిలా త్రేన్పమని మరికొందరు తమ గొంతెమ్మ కోరికలు కోరుతుంటారు. తమ పేర్లు వచ్చేలా త్రేన్పమని అడిగిన వారూ లేకపోలేదు. కిమీకోలా బిగ్గరగానే కాదు.. 9 సెకన్ల దాకా త్రేన్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇటలీకి చెందిన మిచెల్ ఫోర్జియోన్‌ పేరిట 1 నిమిషం 13 సెకన్లపాటు త్రేన్పిన రికార్డు ఇదివరకే నమోదైంది.

Exit mobile version