NTV Telugu Site icon

Bette Nash: ఎనిమిది పదుల వయస్సులోనూ ఎయిర్‌హోస్టెస్‌గా.. ఈ బామ్మ అదుర్స్..

Bette Nash

Bette Nash

ఈ రోజుల్లో 50 ఏళ్లు దాటితేనే ఒళ్లు, కీళ్లు నొప్పులు అని కూర్చుంటారు. ఇక 60 ఏళ్లు దాటితే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ 86 ఏళ్లు వచ్చిన ఓ బామ్మ మాత్రం ఆ వయసులోనూ కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. మనమళ్లు, మనమరాళ్లతో టైమ్ పాస్ చేయాల్సిన టైంలో కూడా ఎయిర్‌హోస్టెస్ బాధ్యతలు అలుపు లేకుండా నిర్వర్తిస్తోంది. సాధారణంగా యువతులు, చిన్న వయసు మహిళలు నిర్వహించే పనిని ఎలా శ్రమ లేకుండా చేస్తూ ప్రయాణికులను అబ్బురపరుస్తోంది. ఏదో చిన్న సంస్థలో అనుకునేరు.. కాదండీ పేరు ప్రఖ్యాతలు గల ఎయిర్‌లైన్స్‌లో మరీ. అంతే కాదు ఆమె మాటతీరు చూసి అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు. అంతే కాకుండా అతిపెద్ద వయస్సు కలిగిన ఎయిర్ హోస్టెస్‌గా గిన్నిస్ రికార్డూ కొట్టేసింది. రిటైర్ అవ్వాల్సిన వయసులోనూ చలాకీగా పని చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటోంది అమెరికాకు చెందిన బెట్టె నాష్.

అమెరికాకు చెందిన బెట్టె నాష్‌ అనే పెద్దావిడ వయసు 86 ఏళ్లు. ఆమె 1957లో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌ హోస్టెస్‌గా కెరీర్‌ ప్రారంభించారు. అలా ఈ ఏడాదితో కలిపి ఆమె 65 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకోనున్నారు. అమెరికాలో పైలట్లు 65ఏళ్లకే రిటైర్‌ అవుతారు.. కానీ కమర్షియల్‌ అటెండెంట్లకు సర్వీసు పరిమితి నిబంధన ఉండదు. దీంతో బెట్టె నాష్ 86 ఏళ్ల వయసులోనూ ఎయిర్ హోస్టెస్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇలా ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కురాలైన ఫ్లైట్‌ అటెండెంట్‌గా ఆమె గిన్నిస్ రికార్డ్ సైతం కొట్టేసింది.ఒకే సంస్థలో సుదీర్ఘ కాలం పనిచేసిన అత్యంత తక్కువ మందిలో బెట్టె నాష్‌ ఒకరు.

ఈ 86 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ ఎక్కువగా కొలంబియా – బాస్టన్ విమానంలో సేవలందిస్తుంటారు. కొలంబియా -బాస్టన్‌ విమానంలో తరచూ ప్రయాణించే వారికి నాష్‌ సుపరిచితమే. చిరాకు పడకుండా అందర్నీ చిరునవ్వుతో పలకరించడంతో ఆమెను అందరూ ఇష్టపడుతుంటారు. కాగా.. బెట్టె నాష్ తన కెరీర్‌లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ జలఫిరంగుల సెల్యూట్‌తో సత్కరించింది. సాధారణంగా రిటైర్‌ అవుతున్న అధికారులకు ఇలాంటి గౌరవం కల్పిస్తారు. ఈ ఏడాదికి ఆమె 65 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఆమెను మరోసారి సత్కరించాలని విమానయాన సంస్థ ఏర్పాట్లు చేస్తోందట. ఈ వయసులోనూ సేవలందిస్తూ శభాష్ అనిపించుకుంటోంది ఈ అమెరికన్ బామ్మ.