NTV Telugu Site icon

Pak train hijack: పాకిస్తాన్ రైలు హైజాక్.. 150 మంది సైనికులు ఊచకోత..

Balochistan

Balochistan

Pak train hijack: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) సంచలన చర్యకు పాల్పడింది. బలూచ్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌కి వెళ్తున్న ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ రైలుని హైజాక్ చేశారు. దాదాపుగా 500 మందితో ప్రయాణిస్తున్న రైలును బలూచ్ వేర్పాటువాదులు తమ అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడింది తామే అని బీఎల్ఏ ప్రకటించుకుంది. బీఎల్‌ఏ ఆత్మాహుతి దళం మాజిద్ బ్రిగేడ్ ఈ హైజాక్‌కి పాల్పడినట్లు తెలుస్తోంది.

Read Also: Pakistan: బలూచ్ ఆర్మీ, పాకిస్తాన్ రైలుని ఎలా హైజాక్ చేసింది..?

ఈ ఘటనలో ఇప్పటి వరకు 150 మంది పాకిస్తాన్ సైనిక సిబ్బంది మరణించారని బీఎల్ఏ తెలిపింది. సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామలు ఉంటాయిన బీఎల్ ఇప్పటికే హెచ్చరించింది. ఇంకా తమ వద్ద 182 మందిని బందీలుగా ఉన్నారని వెల్లడించింది. పర్వత ప్రాంతాల గుండా వెళ్తున్న రైలు పట్టాలను పేల్చేసి, రైలును అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే, బలూచ్ ప్రభుత్వం, పాక్ ప్రభుత్వం ఇప్పటి వరకు బందీలు, ప్రాణ నష్టం గురించి చెప్పలేదు. పాకిస్తాన్ బలగాలు ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లాయి. ఇప్పటికే బీఎల్ఏ, పాక్ ఆర్మీ మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

రైల్వే అధికారుల ప్రకారం.. రైలులోని 9 కోచ్‌లలోని 450 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎలాంటి కాంటాక్ట్ లేదని తెలుస్తోంది. మరోవైపు పాక్ దళాలు ఏదైనా ఆపరేషన్ నిర్వహిస్తే బందీలను దారుణంగా చంపేస్తామని బీఎల్ఏ హెచ్చరించింది. మహిళలు, పిల్లలు, బలూచ్ ప్రయాణికులు, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రయాణికుల్ని బీఎల్ఏ వదిలేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పంజాబ్ ప్రాంత ప్రయాణికులను బందీలుగా తీసుకుంది.