60,000 deaths in a month due to covid in China: చైనాను కోవిడ్ మహమ్మారి కమ్మేస్తోంది. అక్కడ జీరో కోవిడ్ విధానం ఎత్తేయడంతో ఎప్పుడూ చూడని విధంగా కేసులు నమోదు అవుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో చైనాలో కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరబోతున్నట్లు అంచనా వేస్తున్నారు నిపుణులు. అయితే చైనా మాత్రం మరణాలు, కేసుల వివరాలను స్పష్టంగా ప్రకటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే చైనాలో ఒకే నెలలో కోవిడ్ బారినపడి ఏకంగా 60,000 మంది మరణించినట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సి) వెల్లడించింది.
Read Also: Karnataka: గుడి వద్ద హిందువులే వ్యాపారాలు చేయాలి..వీహెచ్‌పీ వార్నింగ్
కోవిడ్ పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చైనా నేషనల్ హెల్త్ కమిషన్ డైరెక్టర్ మా జియోవేతో మాట్లాడారు. కోవిడ్ విషయంలో చైనా సహకారం, పారదర్శకత అవసరం అని ఆయన పునరుద్ఘాటించారు. కోవిడ్ విజృంభించడం వల్ల డిసెంబర్ నెలలో చైనాలోని పేషెంట్లతో ఆస్పత్రులు, శవాలతో శ్మశానాలు నిండిపోయాయి. అయితే ఆ సమయంలో చైనాలో సంభవించిన మరణాలను, కేసుల వివరాలను బయటపెట్టలేదు అక్కడి ప్రభుతం. డిసెంబర్ 8 నుంచి జనవరి 12 మధ్య మరణాలు మాత్రమే రికార్డ్ చేసింది. ఈ కాలంలో 59,938 మంది కోవిడ్ వల్ల మరణించినట్లు వెల్లడించింది. అయితే సంఖ్య మరింత ఎక్కువగా ఉండచ్చని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే జనవరి చివరి వారంలో చైనాలో నూతన సంవత్సర వేడుకలు జరగనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కోట్లలో ప్రజలు ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో దీని తర్వాత చైనాలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు చైనీయులు ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కోసం హాంకాంగ్ పరిగెడుతున్నారు. ఓ నివేదిక ప్రకారం చైనాలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో కోవిడ్ మూడు వేవ్ లు వస్తాయని అంచనా. ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ వల్ల చైనాలో కరోనా వేగంగా విస్తరిస్తోంది.