అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. అమెరికాకు కంటైనర్ ట్రక్ లో వలస వస్తున్న వారు కంటైనర్ లోనే మరణించారు. ఊపిరి ఆడకపోవడం, విపరీతమైన వేడి కారణంగా అందులోనే చనిపోయారు. ఈ ఘటనలో మరణాల సంఖ్య 51కి చేరింది. టెక్సాస్ లోని శాన్ ఆంటోనియోలో మంగళవారం రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్ కంటైనర్ లో పెద్ద సంఖ్యలో శవాలను కనుక్కున్నారు. మరణించిన వారిలో 39 మంది పురుషులు ఉండగా..12 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం మరో 16 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
ఈ ఘటనపై అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హ్యుమన్ స్మగ్లింగ్ ముఠాల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఘటనపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీని విచారణకు ఆదేశించారు. ఈ ఘటన బిలియన్ డాలర్ల హ్యూమన్ స్మగ్లింగ్ పై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనను విచారిస్తున్న అధికారులు ట్రక్ రిజిస్ట్రేషన్ ఆధారంగా ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. వీరిద్దరు మెక్సికన్ జాతీయులుగా గుర్తించారు. ట్రక్ డ్రైవర్ ని అరెస్ట్ చేశారు.
మెక్సికో, ఇతర లాటిన్ అమెరికా దేశాల నుంచి ఏటా కొన్ని వేల మంది యూఎస్ కు అక్రమంగా ప్రవేశిస్తుంటారు. తాజాగా జరిగిన ఘటన కూడా వలస వచ్చే క్రమంలోనే జరిగినట్లు తెలుస్తోంది. మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యయెల్ లోపేజ్ ఒబ్రాడర్ మాట్లాడుతూ.. చనిపోయిన వారిలో 22 మంది మెక్సికోకు, ఏడుగురు గ్వాటెమాల, ఇద్దరు హోండూరస్ కు చెందిన వారని చెప్పారు.
