Uganda: ఆఫ్రికా దేశం ఉగాండాలో దారుణం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ తో సంబంధం ఉన్న మిలిటెంట్లు దారుణానికి తెగబడ్డారు. 37 మంది విద్యార్థులను అత్యంత దారుణంగా నరికి కాల్చి చంపారు. ఇది ఈ దశాబ్ధంలోనే అత్యంత దారుణమైన సంఘటన అని ఉగాండా అధికార వర్గాలు పేర్కొన్నాయి. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సమీపంలోని కాసేస్ జిల్లాలోని మ్‌పాండ్‌వేలోని సెకండరీ స్కూల్‌పై శుక్రవారం అర్థరాత్రి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
విద్యార్థులు ఉండే హాస్టళ్లను తగలబెట్టారు. విద్యార్థులను కత్తులతో నరికివేశారని అధికారులు తెలిపారు. మరణించిన 37 మంది విద్యార్థులు మృతదేహాలను బ్వేరాలోని ఆస్పత్రికి తరలించినట్లు ఉగాండా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపాయి. ఈ ఘటనలో మరో 8 మంది గాయపడ్డారని.. ఆరుగురిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. కిడ్నాప్ చేసిన వారిని కాంగో సరిహద్దుల్లో ఉన్న విరుంగా నేషనల్ పార్క్ వైపు తీసుకెళ్తున్నారని, విద్యార్థులను రక్షించేందుకు భద్రతా సిబ్బంది వెంబడించడం ప్రారంభించిందని ఉగాండా ప్రభుత్వం వెల్లడించింది.
Read Also: Adipurush: ఆదిపురుష్‌పై ఆప్ వర్సెస్ బీజేపీ.. మనోభావాలు దెబ్బతీశారని ఆరోపణ.
సోమాలియాకు చెందిన అల్-షబాబ్ గ్రూప్ 2010లో కంపాలాలో జంట పేలుళ్లకు పాల్పడింది. ఆ సమయంలో 76 మంది మరణించారు. ఆ తరువాత ఇప్పుడే అతిపెద్ద ఉగ్రదాడి జరిగింది. దాడి జరిగిన సరిహద్దు కాంగో దేశానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో ఏడీఎఫ్ మిలిటెంట్లు క్రియాశీలకంగా ఉన్నారు. 1990 నుంచి వేలాది మందిని వీరు చంపారు. మిలిటెంట్లు ముందుగా బాలుర వసతి గృహానికి తాళం వేసి నిప్పటించారు. కాగా, బాలిక వసతి గృహానికి తాళం వేయలేదు, తమను తాము రక్షించుకునేందుకు పరిగెత్తుతున్న సమయంలో వారిపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంత తీవ్రంగా కాలిపోయాయని, డీఎన్ఏ పరీక్ష చేయాల్సి ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు.
ఉగాండాలోని పాఠశాలపై ADF దాడి చేయడం ఇది మొదటిది కాదు. జూన్ 1998లో కాంగో సరిహద్దు సమీపంలోని కిచ్వాంబా టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌పై ఏడీఎఫ్ మిలిటెంట్లు చేసిన దాడిలో 80 మంది విద్యార్థులు వారి వసతి గృహాలలో కాలిపోయారు. 100 మందికి పైగా విద్యార్థులు గల్లంతయ్యారు. ఉగాండా, కాంగో 2021లో ఏడీఎఫ్ ను తరిమికొట్టేందుకు ఉమ్మడిగా దాడులు చేస్తున్నాయి. అయితే చర్యలు సత్ఫలితాలను ఇవ్వలేదు.