
ప్రపంచాన్ని కరోనా ఎంతగా భయపెడుతుంది అంటే… తప్పులు చేసి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కూడా అక్కడి నుంచి పంపించే విధంగా భయపెడుతోంది. ఆసియా, యూరప్, దక్షిణ అమెరికా ఖండాలతో పాటుగా అటు ఆఫ్రికా ఖండంలో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆఫ్రికా ఖండంలో కేసులు పెరగడం అంటే అక్కడ మరణమృదంగం అని చెప్పాలి. ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో వైద్య వసతులు తగినంతగా ఉండవు. పైగా, ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో చాలా వరకు ఒక్క వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అనేక దేశాల్లో జైల్లోని ఖైదీలు సైతం కరోనా బారిన పడుతుండటంతో వారిని ప్రత్యేక బ్యారెక్ లలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
అయితే ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వే వంటి పేద దేశంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అక్కడ కరోనా భయంతో జైల్లో శిక్షను అనుభవిస్తున్న దాదాపుగా మూడు వేల మంది ఖైదీలను విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వివిధ కేసుల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను అధ్యక్షుడి క్షమాభిక్ష ద్వారా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 400 మంది ఖైదీలను విడుదల చేశారు.