NTV Telugu Site icon

Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష.. ఏం చేసిందో తెలుసా?

Sheep Jailed In Africa

Sheep Jailed In Africa

శిక్షలు ఎవరికి వేస్తారు..? నేరాలకు పాల్పడిన మనుషులకి! అవే నేరాలు (మనుషులపై దాడి చేయడం) జంతువులు చేస్తే.. వాటి జోలికి ఎందుకెళ్ళారంటూ రివర్స్‌లో మన మీదే ఎగబడతారు. నోరు లేని మూగజీవుల్ని కెలికినందుకు.. తగిన శాస్తే జరిగిందంటూ శాపనార్ధాలు పెడతారు కూడా! కానీ, ఆఫ్రికా దేశంలో మాత్రం భిన్నంగా ఓ గొర్రెకు శిక్ష వేశారు. ఓ మనిషిని చంపిన నేరంలో.. మూడేళ్ళ జైలు శిక్ష విధించారు. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

దక్షిణ సూడాన్‌లో 45 ఏళ్ల అదీయు చాపింగ్ అనే మహిళపై రామ్ అనే ఒక గొర్రె దాడి చేసింది. తప్పించుకోవడానికి ఆ మహిళ ఎంత ప్రయత్నించినా, ఆ గొర్రె వదల్లేదు. వెంటపడి మరీ విచక్షణారహితంగా ఆమెపై విరుచుకుపడింది. దీంతో, తీవ్ర గాయాలపాలైన ఆ మహిళ మరణించింది. రుంబెక్ ఈస్ట్‌లోని అకుయెల్ యోల్ అనే ప్రదేశంలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ గొర్రెను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అంతేకాదు.. కస్టమరీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కూడా! ఈ గొర్రె వల్ల ఇతరులకూ ప్రమాదం ఉండొచ్చన్న ఉద్దేశంతో.. కోర్టు దానికి మూడేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసింది. శిక్షలో భాగంగా ఆ గొర్రె లేక్స్ స్టేట్‌లోని సైనిక శిబిరంలో గడుపుతుంది.

అంతేకాదండోయ్.. ఆ గొర్ర యజమాని అయిన డుయోని మాన్యాంగ్‌కు కూడా కోర్టు జరిమానా విధించింది. బాధితురాలి కుటుంబానికి ఐదు ఆవులు అప్పగించాలని తీర్పు ఇచ్చింది. దక్షిణ సూడాన్‌ చట్టాల ప్రకారం.. ఏదైనా జంతువు దాడిలో ఓ వ్యక్తి చనిపోతే, శిక్షా కాలం ముగిసిన తర్వాత దాన్ని బాధిత కుటుంబానికి పరిహారంగా ఇచ్చేస్తారు. అంతే, మూడేళ్ళ జైలు శిక్ష అనుభవించాక, ఆ గొర్రెని బాధిత కుటుంబానికి ఇచ్చేస్తారు. ఈ మేరకు ఇరు వర్గాలు పోలీసులు సమక్షంలో ఒప్పందం చేసుకోవడం జరిగింది.