Israel: ఇజ్రాయిల్ వరస దాడులతో అట్టుడుకుతోంది. సరిహద్దు దేశాల నుంచి వరసగా రాకెట్ దాడులను ఎదుర్కొంటోంది. జెరూసలెం అల్-అక్సా మసీదు ఘటన తర్వాత నుంచి పాలస్తీనా, లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్ దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సిరియా నుంచి రాకెట్ దాడులు జరిగాయి. అంతకుముందు రోజు ఇజ్రాయిల్ వాణిజ్య రాజధాని టెల్ అవీవ్, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఓ ఇటలీ టూరిస్ట్ తో పాటు మొత్తం ముగ్గురు మరణించారు. ఈ ఘటన తర్వాత ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ సైన్యం సమీకరణకు పిలుపునిచ్చారు.
Read Also: CSK vs MI: రహానే మెరుపు అర్థ సెంచరీ.. 10 ఓవర్లలో చెన్నై స్కోరు ఇలా..
శనివారం రోజు సిరియా నుంచి రాకెట్ దాడులు జరిగాయి. సిరియా భూభాగం నుంచి మూడు రాకెట్లతో దాడులు జరిగినట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది. బుధవారం అల్ – అక్సా మసీదులో పాలస్తీనియన్లు ఇజ్రాయిల్ భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ జరిగింది. దీని తర్వాత లెబనాన్ నుంచి పదుల సంఖ్యలో రాకెట్ దాడులు జరిగాయి. గురువారం లెబనాన్ నుండి 25 రాకెట్లను ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ అడ్డగించగా, ఐదు ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకాయి. దీంతో ఇజ్రాయిల్ పాలస్తీనా గాజా స్ట్రిప్, లెబనాన్ లోని హమాస్ తీవ్రవాద స్థావరాలపై వైమానికి దాడులు జరిగాయి.
ముస్లింల పవిత్రమాసం రంజాన్, యూదుల పాస్ ఓవర్, క్రిస్టియన్ ఈస్టర్ వేడుకల సందర్భంగా ఇజ్రాయిలో లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గతేడాది డిసెంబర్ నెలలో బెంజిమెన్ నెతన్యాహూ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత నుంచి ఇజ్రాయిల్ వరస దాడులు ఎదుర్కోంటోంది.