NTV Telugu Site icon

Ismail Haniyeh: ఇద్దరు ఇరాన్ ఏజెంట్లు, 3 గదుల్లో బాంబులు.. మొసాద్ డెడ్లీ ఆపరేషన్..

Hamas Chief

Hamas Chief

Ismail Haniyeh: హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రమాణస్వీకారానికి వచ్చిన ఆయనను రాజధాని టెహ్రాన్‌లో అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో హత్య చేశారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ఫ్స్ పర్యవేక్షణలో ఉన్న గెస్ట్ హౌజ్‌లో ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యారు. అయితే, ఈ హత్యకు సంబంధించి ఇజ్రాయిల్ ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు ఇరాన్, హమాస్, హిజ్బుల్లాలు ఈ దాడి ఇజ్రాయిల్ మొసాద్ చేసిందని ఆరోపిస్తోంది. దీనికి తప్పకుండా ప్రతీకారం ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.

అయితే, గత కొన్నాళ్ల నుంచి హనియేని ఎలిమినేట్ చేయాలని ఇజ్రాయిల్ గూఢఛార సంస్థ మొసాద్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇద్దరు ఇరాన్ ఏజెంట్లను మొసాద్ నియమించుకున్నట్లు ది టెలిగ్రాఫ్ నివేదించింది. ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన తర్వాత ఆయన అంత్యక్రియలకు వచ్చిన సందర్భంలోనే హనియేని హత్య చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. విపరీతంగా రద్దీ ఉండటంతో ఆ ప్లాన్‌ని నిలిపేశారు. ప్లాన్ విఫలమయ్యే ప్రమాదం కూడా ఉండటంతో హనియే ఆపపరేషన్ ఆ సమయంలో ఆపేశారు.

Read Also: Paris Olympics 2024: ఇమానే ఖలీఫ్ తర్వాత మరో వివాదాస్పద బాక్సర్..

హనియే ఎలిమినేట్ ఆపరేషన్ ఎలా సాగింది..?

దీంతో ఆపరేషన్‌ని కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకార సమయానికి మార్చారు. ఉత్తర టెహ్రాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ఫ్స్ ఆధీనంలో ఉన్న గెస్ట్ హౌజులోనే హనియే ఉంటాడని ఇరాన్ ఏజెంట్లు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. మూడు గదుల్లో బాంబులు పెట్టినట్లు టెలిగ్రాఫ్ తెలిపింది. ఇరాన్ అధికారుల వద్ద ఉన్న నిఘా ఫుటేజీలో, ఏజెంట్లు మూమెంట్స్ రికార్డయ్యాయి. ఇద్దరు నిమిషాల వ్యవధిలో రూముల్లోకి ప్రవేశించడం, నిమిషాల వ్యవధిలో నిష్క్రమించడం చూపిస్తుంది. హనియే ఉంటాడని అంచనా వేసిన రూముల్లో పరికరాలను ఉంచి, వారు గుర్తించబడకుండా ఇరాన్ నుంచి బయటకు వెళ్లారు. కానీ దేశంలోని సోర్సెస్‌ని కొనసాగించారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు, మొసాద్ ఏజెంట్లు హనియే బస చేసిన గదిని రిమోట్‌తో పేల్చేశారు.

మొసాద్ ఎలా పనిచేస్తుంది..?

3 బిలియన్ల వార్షిక బడ్జెట్‌తో 7000 మంది సిబ్బందితో ప్రపంచంలో అమెరికా సీఐఏ తర్వాత రెండో అతిపెద్ద గూఢచార ఏజెన్సీగా మొసాద్ ఉంది. మొసాద్ అనేక విభాగాలను కలిగి ఉంది. ఇది పాలస్తీనా మిలిటెంట్ గ్రూపుల్లోనే కాకుండా లెబనాన్, సిరియా, ఇరాన్ వంటి దేశాల్లో ఇన్‌ఫార్మర్లను, ఏజెంట్ నెట్వర్క్‌ని కలిగి ఉంది. మెట్సాడా అని కూడా పిలువబడే స్పెషల్ ఆపరేషన్ విభాగం, అత్యంత సున్నితమైన హత్యలు, విధ్వంసం వంటి యుద్ధకార్యక్రమాలను నిర్వహిస్తుంది.