Turbulence: లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో కుదుపుల ఘటనలో ఒక ప్రయాణికులు మరణించడంతో పాటు చాలా మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన మరవక ముందే దోహా నుంచి డబ్లిన్ వెళ్తున్న ఖతార్ ఎయిర్‌వేస్‌కి చెందిన విమానం కుదుపులకు గురైంది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆరుగురు విమాన సిబ్బంది కూడా ఉన్నారు.
టర్కీ మీదుగా విమానం ప్రయాణిస్తున్న సమయంలో హఠాత్తుగా విమానంలో టర్బులెన్స్‌కి గురైంది. ఆరుగురు ప్రయాణికులు మరియు ఆరుగురు సిబ్బంది గాయపడ్డారని డబ్లిన్ ఎయిర్‌పోర్ట్ వర్గాలు ధృవీకరించాయి. “దోహా నుండి ఖతార్ ఎయిర్‌వేస్ విమానం QR017 ఆదివారం 13.00 గంటల ముందు డబ్లిన్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ తర్వాత, ఎయిర్ పోర్టు పోలీస్ రెస్క్యూ సిబ్బంది గాయపడిన 12 మందికి అత్యవసర సేవల్ని అందించింది. టర్కీ మీదుగా వెళ్తున్న సమయంలో విమానం తీవ్ర కుదుపులకు గురైంది’’ అని ఒక ప్రకటనలో తెలియజేసింది.
Read Also: Tragedy: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం.. గోడ కూలి నలుగురు కార్మికులు మృతి
కొన్ని రోజుల క్రితం 211 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్రమైన టర్బులెన్స్‌కి గురైంది. బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో చెలరేగిన అల్లకల్లోలం వల్ల 73 ఏళ్ల బ్రిటన్ ప్రయాణికుడు మరణించాడు. విమానంలోని చాలా మంది తలలకు, వెన్నుముక, మెదడు గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై పరిశోధకులు పరిశోధకులు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ మరియు ఫ్లైట్ డేటా రికార్డర్‌ను విశ్లేషిస్తున్నారని సింగపూర్ రవాణా మంత్రి తెలిపారు. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా బోయింగ్ 777-300ER కేవలం కొన్ని నిమిషాల్లో 1,800 మీటర్లు (6,000 అడుగులు) పడిపోయిందని, చాలా మంది తమకు సీటుబెల్టు బిగించుకునే సమయం కూడా లేదని ప్రయాణికులు చెప్పారు.
ఈ ఘటన తర్వాత సింగపూర్ ఎయిర్‌లైన్స్ తమ విమానాల్లో సిట్ బెల్ట్ నిబంధనల్ని కఠినతరం చేసింది.యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డ్ 2021 అధ్యయనం ప్రకారం, టర్బులెన్స్-సంబంధిత విమాన ప్రమాదాలు అత్యంత సాధారణం. 2009 నుండి 2018 వరకు నివేదించబడిన ఎయిర్‌లైన్ ప్రమాదాలలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ టర్బులెన్స్ వల్లే జరిగాయని ఏజెన్సీ చెప్పింది.