NTV Telugu Site icon

Gaza War: 64 మంది ఇజ్రాయిలీ బందీలు ఎక్కడ..? ఏడాదైనా జాడ లేదు..

Gaza

Gaza

Gaza War: హమాస్-ఇజ్రాయిల్ పోరు ఇప్పటిలో ముగిసేలా కనిపించడం లేదు. అక్టోబర్ 07తో యుద్ధం ప్రారంభమై ఏడాది గడుస్తోంది. అయితే, గతేడాది అక్టోబర్ 07 నాటి దాడి సమయంలో అపహరణకు గురైన ఇజ్రాయిలీ బందీల జాడ ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే, వారెక్కడ ఉన్నారనే వివరాలు ఇంకా తెలియవు. మరోవైపు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వారి కోసం గాజా వ్యాప్తంగా హమాస్ టన్నెల్స్, ఇతర భాగాల్లో క్షుణ్ణంగా వెతుకుతోంది.

Read Also: Rahul Gandhi: కాశ్మీరీ పండిట్లు పాకిస్థాన్ శరణార్థులు? జమ్మూలో రాహుల్ సంచలన వ్యాఖ్య(వీడియో)

ఇజ్రాయిల్‌పై దాడి సమయంలో 251 మందిని బందీలుగా తీసుకున్నారు. వారిలో కొందరు ఇప్పటికే చనిపోయారు. అయితే, గతేడాది ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో హమాస్-ఇజ్రాయిల్ మధ్య బందీల మార్పిడి ఒప్పందం కుదిరింది. దీంట్లో భాగంగా 117 మంది విడుదలయ్యారు. అయితే, ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో 70 మంది బందీలు మరణించినట్లుగా తెలుస్తోంది. మరో 64 మంది జాడ ఇప్పటికీ తెలియరావడం లేదు. వీరంతా ఎక్కడో చోట సజీవంగా ఉన్నారని ఇజ్రాయిల్ భావిస్తోంది. 64 మందిలో 52 మంది పురుషులు, 10 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో 11 మంది ఇజ్రాయిలీ మిలిటరీకి చెందిన వ్యక్తులు ఉన్నారు. బందీల మార్పిలో భాగంగా ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న 240 మంది పాలస్తీనా ఖైదీలు విడుదలయ్యారు. మరణించిన 70 మందిలో 33 మంది మృతదేహాలు ఇప్పటికీ గాజాలో ఉన్నాయని సైన్యం ధృవీకరించింది.

అక్టోబర్ 07 నాటి దాడులు ఇజ్రాయిల్ పై జరిగిన అతిపెద్ద దాడిగా అభివర్ణించవచ్చు. గాజాలోని హమాస్ మిలిటెంట్లు వందలాది రాకెట్లను పేల్చడంతో పాటు ఇజ్రాయిల్ సరిహద్దుల్లోని కిబ్బట్జ్‌పై దాడులు చేశారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు అని చూడకుండా 1200 మందిని హతమార్చారు. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 40 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు.