Silver Price: బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలను తాకుతున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తూ కేవలం రెండు రోజుల్లోనే రూ.60,000కు పైగా పెరగడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో బంగారం ధర కూడా రూ.12,000కు పైగా పెరిగింది. అమెరికా – ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, డోనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై చేస్తున్న హెచ్చరికలు, మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం.. ఇవన్నీ కలిసి బంగారం, వెండి ధరలకు భారీ మద్దతుగా మారాయి.
Read Also: Post Office Scheme: ఈ పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడి పెడితే.. ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించుకోవచ్చు!
గురువారం సాయంత్రం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులు సృష్టించాయి. వెండి ధర ఒక్క రోజులోనే సుమారు రూ.31,000 పెరిగి రూ.4,17,000 (కిలోకు) చేరింది. బంగారం ధర దాదాపు రూ.9,000 పెరిగి రూ.1,75,000కు చేరగా, ట్రేడింగ్ సమయంలో రూ.1,80,000 స్థాయిని కూడా తాకింది. తాజా డేటాను పరిశీలిస్తే.. జనవరి 27న కిలో వెండి ధర రూ.3.56 లక్షలుగా ఉంటే.. జనవరి 29న కిలో వెండి ధర రూ.4.16 లక్షలకు పెరిగింది.. అంటే కేవలం రెండు రోజుల్లోనే వెండి రూ.60,000 లాభాన్ని చూసింది.. ఇక, జనవరి 27న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.68 లక్షలుగా ఉంటే.. ప్రస్తుతం రూ.1.80 లక్షలకు పెరిగింది.. అంటే సుమారు రూ.12,000 పైకి ఎగబాకింది..
వెండి కిలో రూ.5 లక్షలకు చేరుతుందా..?
అమెరికా – ఇరాన్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే, వెండి ధర కిలోకు రూ.5 లక్షలు చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ధరల నుంచి చూస్తే ఇది దాదాపు 20 శాతం పెరుగుదల నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు.. అయితే, ఈ స్థాయిల్లో వెండి కొనుగోలు చేయడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధరలు వేగంగా పెరిగిన తర్వాత అకస్మాత్తుగా భారీ కరెక్షన్ వచ్చే అవకాశాన్ని తోసిపుచ్చలేమని చెబుతున్నారు.. అయితే, ఆర్థిక సర్వే ప్రకారం, బంగారం మరియు వెండి ధరలు సమీప భవిష్యత్తులో స్థిరంగా ఉండొచ్చని, అవసరమైతే ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా. అయితే, 2025లో కనిపిస్తున్న ఈ వేగవంతమైన పెరుగుదల దీర్ఘకాలికంగా నిలకడగా ఉండకపోవచ్చు అని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన కమోడిటీ ధరల అంచనా ప్రకారం, 2027 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ కమోడిటీ ధరలు సుమారు 7 శాతం తగ్గే అవకాశం ఉంది. అధిక సరఫరా, ముడి చమురు ధరలు తక్కువగా ఉండటం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పెట్టుబడిదారులు బంగారం, వెండిలోకి కొత్తగా పెట్టుబడి పెట్టడం పట్ల జాగ్రత్తగా ఉండాలి అని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడి పెట్టినవారు లాభాల్ని బుక్ చేసుకోవడంపై ఆలోచించవచ్చని, కొత్తగా ప్రవేశించే వారు ధరలు స్థిరపడే వరకు వేచి చూడటం మంచిదని సూచిస్తున్నారు.