Site icon NTV Telugu

Gold and Silver: రికార్డుస్థాయికి బంగారం, వెండి ధరలు.. పెట్టుబడులకు అనుకూల సమయమేనా..?

Gold Silver

Gold Silver

Gold and Silver: ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అదే సమయంలో కమోడిటీ ఆధారిత బంగారం, వెండి ETFలు కూడా బలమైన ర్యాలీని నమోదు చేశాయి. దీంతో పెట్టుబడిదారుల ముందు కీలక ప్రశ్న నిలుస్తోంది.. ఇప్పుడు కొనాలా? అమ్మాలా? లేక వేచి చూడాలా? అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి.. గత ఏడాదితో పోలిస్తే బంగారం ధరలు 80 శాతం కంటే ఎక్కువగా, వెండి ధరలు దాదాపు 190 శాతం వరకు పెరిగాయి. వెండి ETFలు 188 శాతం రాబడిని ఇవ్వగా, బంగారు ETFలు 80 శాతం కంటే ఎక్కువ లాభాలను అందించాయి. ప్రస్తుతం ఈ ETFలు అన్నీ రికార్డు గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్నాయి.

Read Also: Diabetic Cases: షాకింగ్ రిపోర్ట్.. భారత్‌లో పెరుగుతున్న “షుగర్” రోగులు.. ప్రపంచంలోనే రెండో స్థానం..!

ఇప్పుడు పెట్టుబడిదారులు ఏమి చేయాలి?
ఇంత భారీ పెరుగుదల తర్వాత కొత్త పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరమని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు మార్కెట్‌లో కొనసాగవచ్చని, అయితే అదనపు పెట్టుబడులను తగ్గించి పోర్ట్‌ఫోలియోను పునర్నిర్మించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇప్పటికే మంచి లాభాలు వచ్చిన వారు కొంతమేర లాభాలను బుక్ చేసుకుని, ధరల్లో కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్లీ కొనుగోలు చేయడం వివేకవంతమైన మార్గమని నిపుణుల అభిప్రాయం.

ఇప్పుడే పెట్టుబడి ఎందుకు ప్రమాదకరం?
రికార్డు స్థాయిల వద్ద ధరలు ఉన్నప్పుడు పెట్టుబడిదారుల్లో FOMO (Fear of Missing Out) పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక ధరలకు కొనుగోలు చేయడం తర్వాత కరెక్షన్ వచ్చినప్పుడు భారీ నష్టాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫైనాన్షియల్ రేడియన్స్ వ్యవస్థాపకుడు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రాజేష్ మినోచా మాట్లాడుతూ, వెండి దీర్ఘకాలికంగా బలమైన లోహమే అయినా, స్వల్పకాలంలో ధరలు పడిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే వెండి ధరలు దాదాపు 200 శాతం పెరిగిన నేపథ్యంలో, కొత్త పెట్టుబడులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఫిస్డమ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సాగర్ షిండే కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వెండి ధరలు రికార్డు స్థాయిలో ఉండటం వల్ల రిస్క్ పెరిగిందని, ఇప్పటికే లాభాలు పొందిన వారు షార్ట్ టర్మ్ లాభాలను నమోదు చేసుకోవచ్చని అన్నారు. బంగారం విషయంలోనూ, ధరలు స్థిరపడే వరకు కొత్త పెట్టుబడులను నివారించాలని సూచించారు.

వెండి ధరలు ఎందుకు ఇంత వేగంగా పెరుగుతున్నాయి?
వెండి ధరలు పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి అని నిపుణులు అంచనా వేస్తున్నారు.. పారిశ్రామిక డిమాండ్ పెరుగుదల – ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి వంటి రంగాల్లో వెండికి భారీ డిమాండ్ ఏర్పడింది. సురక్షిత పెట్టుబడిగా వెండి – ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు పెరగడంతో వెండిని సేఫ్ హావెన్‌గా కొనుగోలు చేస్తున్నారు. సరఫరా కొరత – మైనింగ్‌లో పరిమిత పెట్టుబడులు ఉండటం వల్ల సరఫరా తగ్గిందని అంచనా వేస్తున్నారు.

MCX బంగారం – వెండి తాజా ధరలు
MCXలో మార్చి 5 ఫ్యూచర్స్ వెండి ధరలు గురువారం కిలోకు దాదాపు రూ.600 పెరిగి రూ.2,92,152కు చేరుకున్నాయి, ఇది రికార్డు గరిష్టానికి దగ్గరగా ఉంది. ఫిబ్రవరి 5 ఫ్యూచర్స్ బంగారం ధరలు 10 గ్రాములకు రూ.70 తగ్గి రూ.1,43,056కు చేరుకున్నాయి. అయితే, దీర్ఘకాలికంగా బంగారం, వెండి పెట్టుబడులకు అనుకూలమైనప్పటికీ, ప్రస్తుత రికార్డు స్థాయిల వద్ద కొత్త పెట్టుబడులు పెట్టేముందు జాగ్రత్త అవసరం. లాభాలు బుక్ చేసుకోవడం, కరెక్షన్ కోసం వేచి చూడడం ప్రస్తుతం పెట్టుబడిదారులకు ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version